Lunar Eclipse: గ్రహణ సమయం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. 12 రాశులకు ఈ ఒక్క మంత్రం చాలు
గ్రహణమంటే కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పితృ పక్షంలో వస్తోంది కాబట్టి, ఇది మరింత ప్రత్యేకంగా మారింది. ఈ సమయంలో గ్రహాల స్థానాలు, వాటి ప్రభావాలు మనుషులపై ఎలా ఉంటాయో జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. గ్రహణం సమయంలో ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు జపించాలి, ఎలాంటి పనులు చేస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ సంఘటనను భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూరప్, ఆస్ట్రేలియా దేశాల ప్రజలు వీక్షించవచ్చు. ఇది పితృ పక్షంలో వస్తుంది కాబట్టి ఆధ్యాత్మికంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలకు ప్రతీక. చంద్రగ్రహణం సమయంలో మానసిక అశాంతి, ఒత్తిడి, నిద్రలేమి, సంబంధాల సమస్యలు వస్తాయి. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్యులు ప్రతి రాశికి ప్రత్యేక మంత్రాలు సూచిస్తున్నారు.
మేషం: ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రం జపిస్తే ఆటంకాలు తొలగి, వృత్తిలో విజయం సాధిస్తారు.
వృషభం: ‘ఓం హ్రీం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపిస్తే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.
మిథునం: ‘ఓం క్లీం కృష్ణాయ నమః’ అనే మంత్రం వల్ల స్పష్టత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
కర్కాటకం: ‘ఓం సోమాయ నమః’ అనే మంత్రం జపిస్తే చంద్రుని రక్షణ, ఆశీస్సులు లభిస్తాయి.
సింహం: ‘ఓం హ్రీం సూర్యాయ నమః’ అనే మంత్రం ఆరోగ్యానికి, పేరు ప్రఖ్యాతులకు, పదోన్నతికి దోహదం చేస్తుంది.
కన్య: ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రం అప్పులు తగ్గించుకోవడానికి, అభివృద్ధికి సహాయపడుతుంది.
తుల: ‘ఓం మహా లక్ష్మ్యై నమః’ అనే మంత్రం ఆదాయం పెరగడానికి, కుటుంబం బాగుండటానికి తోడ్పడుతుంది.
వృశ్చికం: ‘ఓం నరసింహాయ నమః’ అనే మంత్రం శత్రువులను జయించి, మానసిక బలం పెంచుకోవడానికి తోడ్పడుతుంది.
ధనుస్సు: ‘ఓం విష్ణవే నమః’ అనే మంత్రం వల్ల ఆధ్యాత్మిక బలం, విద్యలో లాభాలు కలుగుతాయి.
మకరం: ‘ఓం శనిశ్చరాయ నమః’ అనే మంత్రం శని చెడు ప్రభావాలను తగ్గిస్తుంది.
కుంభం: ‘ఓం హ్రీం కాళికాయై నమః’ అనే మంత్రం ధైర్యం, సాహసం పెంచుతుంది.
మీనం: ‘ఓం నమో భగవతే రామానుజాయ’ అనే మంత్రం ఆధ్యాత్మిక పురోగతి, మనశ్శాంతి ఇస్తుంది.
చేయాల్సిన పనులు
గ్రహణం సమయంలో ధ్యానం, మంత్రాలు జపిస్తే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఉప్పు నీటిలో దీపం వెలిగిస్తే ప్రతికూల శక్తి తగ్గుతుంది. గ్రహణం తర్వాత ఆహారం, బట్టలు దానం చేస్తే పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం తర్వాత స్నానం చేసి నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, ప్రజల విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయత లేదు. ఈ సమాచారాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే పరిగణించాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నిపుణులను సంప్రదించడం మంచిది.




