Lucky Zodiac Signs: నాలుగు మిత్ర గ్రహాల యుతి.. ఆ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణం
Telugu Astrology: ప్రస్తుతం మీన రాశిలో నాలుగు మిత్ర గ్రహాలు (శని, శుక్ర, రాహు, బుధుడు) అనుకూల నక్షత్రాలలో సంచారం చేస్తున్నాయి. మే 7 వరకు ఈ యుతి కొనసాగుతుంది. దీని ప్రభావంతో వృషభం, మిథునంతో పాటు మరికొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలలో అభివృద్ధి, పెళ్లి, విదేశీ అవకాశాలు లభిస్తాయి.

Lucky Zodiac Signs
ప్రస్తుతం మీన రాశిలో నాలుగు మిత్ర గ్రహాలు కలిసి ఉండడమే కాకుండా, బాగా అనుకూలమైన నక్షత్రాలలో సంచారం చేయడం జరుగుతోంది. శని, శుక్ర, రాహు, బుధ గ్రహాలు దాదాపు ప్రాణ స్నేహితులు. ఇందులో ఒక్క గ్రహం బాగున్నా ఇతర గ్రహాలు సహకరిస్తాయి. మే 7వ తేదీ వరకు ఈ నాలుగు మిత్ర గ్రహాల యుతి కొనసాగుతుంది. సుమారు 10 రోజుల పాటు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోయే అవకాశం ఉంది.
- వృషభం: లాభ స్థానంలో ఈ 4 మిత్ర గ్రహాల యుతి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందేది ఈ రాశివారే. జీవితంలో ఎక్కువగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి.
- మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో 4 మిత్ర గ్రహాల కలయిక వల్ల కెరీర్ పరంగా భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సైతం అందే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహ సంచారం అధికంగా ఉండడం వల్ల అనేక మార్గాల్లో అదృష్టాలు కలిసి వస్తాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. కెరీర్ లోనే కాక, కుటుంబంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల నుంచి అవసరమైన సహాయ సహ కారాలు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ధనయోగాలు పడతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో మరో మూడు మిత్ర గ్రహాలు కలిసినందువల్ల అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో నాలుగు మిత్ర గ్రహాల యుతి వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
- కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో, అంటే ధన స్థానంలో నాలుగు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



