
Mangalya Dosha
Mangalya Dosha: మాంగల్య కారకుడైన కుజుడు రాశి మారినప్పుడల్లా దాని ప్రభావం జీవిత భాగస్వామి మీద కూడా పడుతుంది. వైవాహిక జీవితం ఏ విధంగా, ఎంత కాలం సాగుతుందనేది నిర్ణయించేది కుజుడే. ప్రస్తుతం తులా రాశిలో సంచారం చేస్తున్న ఈ కుజ గ్రహం ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7 వరకు తన స్వక్షే్త్రమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కుజుడు 1, 2, 4, 7, 8, 12 రాశుల్లో సంచారం చేయడం వల్ల కుజ దోషం లేదా మాంగల్య దోషం కలుగుతుంది. కొన్ని రాశుల వారి వైవాహిక జీవితానికి కుజుడి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వారు తరచూ స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కుజ దోషం తప్పే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మేషం: రాశ్యధిపతి, అష్టమ స్థానాధిపతి కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. అయితే, కొద్దిపాటి అపార్థాలకు, విభేదాలకు మాత్రం అవకాశం ఉంది. దంపతుల మధ్య ఎడబాటు సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కొద్దిపాటి సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు, కీలక విషయాల్లో సంప్రదించడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలోనే సంచారం చేయడం వల్ల ఆయుర్దాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు కానీ, లేనిపోని సమస్యలకు మాత్రం బాగా అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కోపతాపాలతో వ్యవహరించకపోవడం మంచిది. మాట తొందరపాటు వల్ల కూడా దంపతుల మధ్య విభేదాలు, వివాదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల దాంపత్య జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయి.
- సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగకపోవచ్చు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు వంటివి దంపతుల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు, శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.
- తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబంలో సుఖ శాంతులు బాగా తగ్గే అవకాశం ఉంది. పిల్లల కారణంగా విభేదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఈగో సమస్యల వల్ల కూడా బ్బందులు తలెత్తుతాయి. దాంపత్య జీవితం ఆశించినంత హ్యాపీగా సాగకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఎక్కువగా ఉంటుంది.
- వృశ్చికం: కుజ గ్రహానికి ఇది స్వస్థానం అయినందువల్ల కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ, ఈగో కారణంగా కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలను తగ్గించుకుని, ఓర్పు, సహనాలను పెంచు కోవడం మంచిది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. జీవిత భాగ స్వామి మీద ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. మాట తొందర వల్ల ఇబ్బంది పడతారు.
- ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి మాంగల్య దోషం కలిగింది. దీనివల్ల జీవిత భాగస్వామి అనారోగ్యాలకు, వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి దూర ప్రాంతానికి బదిలీ కావడమో, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడమో కూడా జరుగుతుంది. దంపతులు ఒకరితో ఒకరు పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు, మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది.