Zodiac Signs: కొన్ని రాశులకు ఆరోగ్య యోగం.. ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటే.?
సాధారణంగా ఈ రాశి వారు తల సంబంధమైన సమస్యలతో అవస్థలు పడుతుంటారు. వీరికి ఈ సంవత్సరం శని గురువుల సంచారం కారణంగా అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వీరు మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది.
జీవితంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జీవితం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే ఆరోగ్యం అత్యవసరం. కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులకు, సంపదకు సార్ధకత చేకూరాలంటే ఆరోగ్యం తప్పనిసరి. జ్యోతిష శాస్త్రంలో శని గురు గ్రహాలు ఆరోగ్యానికి కారకులు. ఆరవ స్థానం రోగానికి, 11 వ స్థానం ఉపశమనానికి పరిశీలించవలసి ఉంటుంది. ఆరవ స్థానాధిపతిని, 11వ స్థానాధిపతిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి, అంటే గ్రహాల స్థితి గతులను బట్టి, దశ అంతర్దశలను బట్టి రోగాలను, వాటి తీవ్రతను, వాటి నుంచి ఉపశమనాన్ని లేదా విముక్తిని అంచనా వేయవలసి ఉంటుంది. ఒక రాశిలో ఒకటికంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పరిస్థితి మారుతుంది. రోగాలు, రోగ నివారణలు గ్రహ సంచారం మీద కూడా ఆధారపడి ఉంటాయి. కొత్త సంవత్సరంలో గ్రహాల సంచారం ప్రకారం దీర్ఘకాలిక అనారోగ్యాలు, వాటి నుంచి విముక్తి వంటి విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం.
ఈ కొత్త సంవత్సరంలో మేష, మిధున, సింహ, తుల, ధనస్సు, మకర రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకునే అవకాశం ఉంది. శని గురువులు ఈ ఏడాది శక్తివంతంగా ఉన్నందువల్ల మిగిలిన రాశుల వారు కూడా చాలావరకు అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. భరణి మృగశిర పునర్వసు పుబ్బ స్వాతి అనురాధ ఉత్తరాషాడ శతభిషం నక్షత్రాల వారు కూడా ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ నక్షత్రాల వారు సాధారణంగా ఆరోగ్య క్రమశిక్షణను పాటించడమే ఇందుకు కారణం. ఇక శని రాహువులు దీర్ఘకాలిక వ్యాధులను ఇవ్వటం జరుగుతుంది. క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఈ గ్రహాలే కారణం. గురు, చంద్రుల వల్ల మధుమేహం, రక్తసంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. శుక్ర గ్రహం వల్ల లైంగిక సమస్యలు చుట్టుముడతాయి. కుజుడి వల్ల రక్తం, రక్త పోటు, మానసిక ఒత్తిడి, తలనొప్పి, మానసిక సమస్యలు పీడిస్తాయి. రవి వల్ల ఎముకల సమస్యలు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. బుధ గ్రహం వల్ల నరాల సమస్యలు, మెదడు సమస్యలు, కాలేయ సమస్యలు ఇబ్బంది పెడతాయి. రాహు కేతువుల వల్ల రోగ నిర్ధారణ చేయలేని, డాక్టర్లకు అంతు పట్టని, మందులు దొరకని వ్యాధులు పీడిస్తాయి.
మేషం
సాధారణంగా ఈ రాశి వారు తల సంబంధమైన సమస్యలతో అవస్థలు పడుతుంటారు. వీరికి ఈ సంవత్సరం శని గురువుల సంచారం కారణంగా అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వీరు మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఫిబ్రవరి మే నెలల మధ్య వీరి అనారోగ్యాలకి పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాలను లెక్కచేయనితనం ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకున్న పక్షంలో వీరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు దగ్గరకు వచ్చే అవకాశం లేదు.
వృషభం
ఈ రాశి వారికి ఒక పట్టాన దీర్ఘకాలిక అనారోగ్యాలు దగ్గరకు రావు. అటువంటి అనారోగ్యాలు దగ్గరకు వస్తే ఒక పట్టాన వదిలిపెట్టవు. సాధారణంగా స్పాండిలైటిస్ వంటి మెడ సంబంధమైన వ్యాధులు వీరిని పీటిస్తుంటాయి. స్థూలకాయం కూడా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. థైరాయిడ్, కొలెస్ట్రాల్ వీరి ప్రధాన సమస్యలు. ఈ ఏడాది వీరికి ఈ సమస్యల నుంచి కొద్దిగా మాత్రమే ఉపశమనం లభించే అవకాశం ఉంది. బహుశా ఇది మే నెల తర్వాత జరగొచ్చు.
మిథునం
ఈ రాశి వారికి సాధారణంగా భుజాలు, కీళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాక, వీరు ఎక్కువగా వ్యసనాల వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతుంటారు. ఈ రకమైన అనారోగ్యాల నుంచి వీరికి ఏప్రిల్ తర్వాత విముక్తి లేదా పరిష్కారం లభించే అవకాశం ఉంది. వీరు ఆరోగ్య సంబంధమైన క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆహార విహారాల విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.
కర్కాటకం
ఈ రాశి వారికి గుండె, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలు తరచుగా వస్తుంటాయి. అయితే, వీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచైనా వేగంగా కోలుకుంటారు. ఆయాసం, శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యాల నుంచి వీరికి మార్చి తరువాత ఉపశమనం లభించే అవకాశం ఉంది. వీరు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. శీతల పానీయాలను తీసుకోకపోవడం శ్రేయస్కరం. కొద్దిపాటి ఆరోగ్య క్రమశిక్షణతో వీరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. వ్యసనాల కారణంగా నడివయసులో వీరి గుండె బలహీనపడే అవకాశం ఉంటుంది.
సింహం
ఈ రాశి వారు ఎక్కువగా ఎముకలు, రక్తం, కాలేయ సంబంధమైన దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడతారు. వీరిని ఏదైనా అనారోగ్యం పట్టుకుంటే అంత తేలికగా వదిలిపెట్టదు. అనారోగ్యాల విషయంలో ఈ రాశి వారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. జూలై నెల తరువాత నుంచి వీరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు నుంచి చాలావరకు ఉపశమనం లేదా పరిష్కారం లభిస్తుంది. వీరికి క్రమబద్ధమైన జీవితం చాలా మంచిది. వీరు చర్మవ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. మితిమీరిన భోజన ప్రియత్వాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది.
కన్య
ఈ రాశి వారు చర్మం, కండరాలు, పొత్తికడుపు సమస్యలతో ఇబ్బందులు పడతారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వల్ల కూడా అవస్థలు పడతారు. సాధారణంగా మహిళలు గర్భసంచి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఈ రాశి వారు చాలావరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మార్చి నెల నుంచి వీరు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడటం మొదలవుతుంది.
తుల
ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యమైనా వీరికి ఏదో విధంగా పరిష్కార మార్గం దొరుకుతుంది. వీరిలో ఆరోగ్య క్రమశిక్షణ తక్కువగా ఉన్నప్పటికీ అంత త్వరగా దీర్ఘకాలిక వ్యాధులు దగ్గరకు వచ్చే అవకాశం లేదు. సాధారణంగా వీరు పేగులు, పొత్తికడుపు సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడతారు. రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు కూడా వీరిని మధ్య వయసులో చుట్టుముడతాయి. ఈ రకమైన సమస్యలు వీరికి ఫిబ్రవరి నెల నుంచి అదుపులోకి వస్తాయి. వీరు ఆహార విహారాల్లో తప్పనిసరిగా నియంత్రణ పాటించాలి.
వృశ్చికం
ఈ రాశి వారు సాధారణంగా జననేంద్రియాలు, మూత్రపిండాల సమస్యలతో అవస్థలు పడతారు. వీరు మద్యపానానికి, ధూమపానానికి ఎంత దూరంలో ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. అక్రమ సంబంధాలు ఇతర వ్యసనాలకు అలవాటు పడకపోవటం శ్రేయస్కరం. అనారోగ్య సమస్యలు పట్టుకుంటే వదిలిపెట్టవు. అందువల్ల ముందుగానే కొన్ని అనారోగ్య అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి వీరు అక్టోబర్ తర్వాత ఉపశమనం పొందటానికి అవకాశం ఉంది.
ధనుస్సు
ఎలర్జీ, కీళ్ల నొప్పులు, కుంగు బాటు, కీళ్ల నొప్పులు, రక్తపోటు వంటి సమస్యలు వీరిని ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. వీరి సమస్యలకు ఒక్కోసారి వైద్య సంబంధమైన పరిష్కారం లభించడమే కష్టం అవుతుంది. అందువల్ల వీరు ఒక వ్యక్తిగత వైద్యుడిని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీరిని ఈ ఏడాది దీర్ఘకాలిక వ్యాధులు బాధించే అవకాశం లేదు. అయినప్పటికీ వీరు ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది.
మకరం
ఈ రాశి వారికి సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఒక సమస్యగా మారతాయి. స్థూలకాయం సమస్య కూడా వీరిని పీడిస్తుంది. వీరికి ఈ ఏడాది కొత్తగా అనారోగ్యం బాధించే అవకాశం లేదు. ఇదివరకు అనుభవిస్తున్న అనారోగ్యం జనవరి నెల నుంచి ఉపశమనం ఇవ్వడం ప్రారంభిస్తుంది. సాధారణంగా వీరు ఆరోగ్య క్రమశిక్షణ ను పాటించే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది.
కుంభం
వీరు ఈ ఏడాది ఎక్కువగా నిర్ధారణ కాని లేదా డాక్టర్లకు కూడా అర్థం కాని, అంతుబట్టని దీర్ఘకాలిక సమస్యతో బాధపడే అవకాశం ఉంది. అంతేకాదు వీరిని సాధారణ లేదా తరుణ వ్యాధులు సైతం ఎక్కువ కాలం పీడించే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఈ రాశి వారు ఆహార నియమాలతో పాటు ఆరోగ్య క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించడం చాలా అవసరం. అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఏది ఏమైనా, వీరికి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి జూన్ తరువాత కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం ఉంది.
మీనం
కాళ్ళ వాపులు, కాళ్లకు నీరు పట్టడం, తల తిరగటం, రక్త ప్రసారం సరిగ్గా లేకపోవడం, జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీరిని జీవితంలో ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెడతాయి. అయితే, ఈ రాశి వారు సాధారణంగా యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయ వైద్య పద్ధతులు వగైరాల ద్వారా కొంత సమస్యను తగ్గించుకోవ డానికి అవకాశం ఉంది. వీరు జూలై నెల నుంచి ఉపశమనం పొందటానికి వీలుంది. వీరు శారీరక శ్రమను వీలైనంత తగ్గించుకొని మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.