గురువుకు అతిచార దోషం.. ఆ రాశుల వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం పక్కా..!
గురువు మే 25న మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ రాశిలో జూన్ 2 వరకు సంచారం చేస్తాడు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశించే గురువుకు అతిచార దోషం కలగనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ యోగాలు పట్టనున్నాయి. అనేక విధాలుగా ఆ రాశుల వారు వృద్ధి చెందుతారు.

Shubh Yoga
ఈ నెల 25న మిథున రాశిలో ప్రవేశిస్తున్న గురువు ఆ రాశిలో జూన్ 2 వరకు సంచారం చేయవలసి ఉంది. అయితే, గురువుకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకూ అతిచార దోషం, అంటే శీఘ్ర పురోగమనం కలిగి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కర్కాటకం గురువుకు ఉచ్ఛ రాశి. గురువు మిథున రాశి సంచారం వల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురయ్యే రాశులకు ఈ అతిచారం వల్ల శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు అనేక విధాలుగా ‘వృద్ధి‘ కలుగుతుంది.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల వైవాహిక సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. గురువు అతిచారం వల్ల సుఖ సంతోషాలతో సాగి పోయే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయవృద్ధి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి.
- కర్కాటకం: వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఈ రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం వల్ల అతిచార దోష కాలంలో ఈ రాశివారి ప్రాభవం, వైభవం బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడి స్థాయికి ఎదుగుతారు. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి.
- కన్య: ఈ రాశికి పదవ స్థానమైన మిథునంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఎక్కువగా ఉండడంతో పాటు ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. పని భారంతో ఇబ్బంది పడ డం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. అతిచార దోషంతో గురువు కర్కాటక రాశి లోకి ప్రవేశించడం వల్ల రెండు నెలల పాటు వీరు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం: గురువు అష్టమ స్థాన సంచారం నుంచి భాగ్య స్థాన సంచారంలోకి ప్రవేశించడం వల్ల ఒక రెండు నెలల పాటు వీరికి ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. విదేశీ పర్యటనలకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురువు సంచారం వల్ల ‘తానొకటి తలచిన దైవమొకటి తలచును’ అన్నట్టుగా జీవితం సాగిపోయే అవకాశం ఉంటుంది. అయితే, అతిచార దోషంతో గురువు సప్తమ స్థానంలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- మీనం: చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఉద్యోగంలో పని భారం పెరగడం, స్థిరత్వం లభించకపోవడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం, చదువుల్లో వెనుకబడడం వంటివి జరుగుతాయి. అయితే, రాశ్యధిపతి గురువు అతిచార దోషంతో పంచమ స్థానంలో ఉచ్ఛస్థితికి వస్తున్నందువల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.