Money Astrology: ఆరు రాశులకు ఖల యోగం! ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి మే 25 వరకు ఖల యోగం ఉంది. శుక్ర, గురు గ్రహాల పరివర్తన వల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు చేయడం మంచిది కాదు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం.

Money Astrology 2025
జ్యోతిషశాస్త్రం ప్రకారం దుస్థానాల అధిపతులతో శుభ స్థానాల అధిపతులు పరివర్తన చెందినప్పుడు ఖల యోగం ఏర్పడుతుంది. ఖల యోగమంటే దుష్ట యోగమని అర్థం. 3, 6, 8, 12 రాశుల అధిపతులు 1, 2, 4, 5, 7, 9, 10,11 స్థానాలతో పరివర్తన చెందినప్పుడు ఖల యోగం ఏర్పడుతుంది. ఈ ఖల యోగం వల్ల ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం శుక్ర, గురువుల మధ్య పరివర్తన కొనసాగుతోంది. ఈ పరివర్తన మే 25 వరకు కొనసాగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు ఈ ఖల యోగం ఏర్పడింది. శుక్రుడికి చెందిన వృషభ రాశిలో గురువు, గురువుకు చెందిన మీన రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది.
- మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి శుక్రుడు వ్యయంలో, వ్యయ స్థానాధిపతి గురువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఖల యోగం ఏర్పడింది. దీనివల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో రూపేణా వృథా కావడం జరుగుతుంది. చేతిలో డబ్బు నిలవడి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావదేవీలకు, ఆర్థిక సహాయాలకు, కొత్త పెట్టుబడులకు మే 25 వరకూ దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. తొందరపాటుతో వ్యవహరించడం ఎక్కువవుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ, వ్యయాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగపరంగా చిక్కులు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉండకపోవచ్చు. ఆర్థికాభివృద్ధి కొద్దిగా మందగిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన లేదా సంతృప్తికరమైన ఉద్యోగం లభించకపోవచ్చు. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి.
- సింహం: ఈ రాశికి అష్టమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. దీని వల్ల అధికారుల నుంచి ఒత్తిడి, విమర్శలు, వేధింపులు పెరిగే సూచనలున్నాయి. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. రావలసిన పదోన్నతి ఆగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు మిత్రులు దూరమవుతారు.
- తుల: ఈ రాశికి షష్ట, అష్టమ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఖల యోగం ఏర్పడింది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉండదు. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది కానీ, అది అనేక ఇబ్బందులు సృష్టిస్తుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తి కరంగా నెరవేరే అవకాశం ఉండదు. ఆర్థిక వ్యవహారాల్లో మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ, షష్టాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఖల యోగం ఏర్పడింది. వ్యక్తి గతంగానే కాక, కుటుంబపరంగా కూడా సుఖ సంతోషాలు లోపిస్తాయి. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వ్యయ ప్రయాసలు లేకుండా ఏ ప్రయత్నమూ నెరవేరకపోవచ్చు. గృహ, వాహన ప్రయత్నాలు అసంతృప్తిని కలిగిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశినాథుడైన గురువుకు తృతీయ స్థానాధిపతి శుక్రుడితో పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. దీని ఫలితంగా ఏ ప్రయత్నమూ పూర్తిగా నెరవేరని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధిలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా తగ్గే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదల ధైర్యం తగ్గిపోతాయి.