బుధ, శుక్ర గ్రహాల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి అద్భుత యోగం పక్కా..!
Mercury and Venus Parivartan Yoga: శుక్రుడికి చెందిన తులా రాశిలో బుధుడు ఉండడం, బుధుడికి చెందిన కన్యారాశిలో శుక్రుడు ప్రవేశించడం జరుగుతోంది. ఈ రెండు సహజమైన శుభ గ్రహాలు కావడం వల్ల ఈ పరి వర్తన అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఇది అయిదు రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను లేదా శుభయోగాలను ఇచ్చే అవకాశం ఉంది.
నవంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాల మధ్య పరివర్తన జరగబోతోంది. అంటే శుక్రుడికి చెందిన తులా రాశిలో బుధుడు ఉండడం, బుధుడికి చెందిన కన్యారాశిలో శుక్రుడు ప్రవేశించడం జరుగుతోంది. ఈ రెండు సహజమైన శుభ గ్రహాలు కావడం వల్ల ఈ పరి వర్తన అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఇది అయిదు రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను లేదా శుభయోగాలను ఇచ్చే అవకాశం ఉంది. అవిః మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం. ఈ రాశుల వారికి ఈ పరివర్తన యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా వ్యక్తిగత, కుటుంబపరంగా కూడా తప్పకుండా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
- మిథునం: ఈ రాశివారికి బుధ, శుక్రుల పరివర్తన అంటే అది చతుర్థ, పంచమ స్థానాల మధ్య పరివర్తన అవుతుంది. ఈ రెండు స్థానాలు అత్యంత శుభ స్థానాల కింద లెక్క. పైగా ఈ రాశికి బుధుడు రాశ్యధిపతి కూడా అయినందువల్ల తప్పకుండా రాజయోగం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ఆశించిన శుభవార్తలు వినడంతో పాటు, కుటుంబపరంగా కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలకు, సతీమణికి సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ, చతుర్థ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల తప్పకుండా శుభ వార్తలు వినడం జరుగుతుంది. వ్యక్తిగతంగా పురోగతి ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు అంచనాలకు మించిన లాభాలు ఆర్జిస్తాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశ్యధిపతి బుధుడికి శుక్రుడితో, అంటే ధనాధిపతితో పరివర్తన జరగడం వల్ల, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవు తుంది. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి కలిసి రావడం వంటివి జరుగుతాయి. అన్ని విధాలుగానూ ఆదాయం పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. సతీమణికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. తీర్థయాత్రకు లేదా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యానికి ప్లాన్ చేస్తారు.
- ధనుస్సు: ఈ రాశివారికి 10, 11స్థానాల మధ్య పరివర్తన జరగడం గొప్ప అదృష్టాన్ని సూచిస్తోంది. ఉద్యో గంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రమోషన్ రావడం, ఇంక్రిమెంట్ పెరగడం వంటివి కూడా జరగవచ్చు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, వ్యాపారాల తీరు తెన్నులు సానుకూలంగా మారుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవు తుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.
- మకరం: ఈ రాశివారికి 9, 10 స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం ఒక మహాయోగం. జ్యోతిషశాస్త్రంలో దీనిని ధర్మకర్మాధిప యోగంగా చెప్పడం జరిగింది. ఈ యోగం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో వీరి ప్రతిభా పాటవాలు బాగా ప్రకాశించడం, వీరికి సరైన గుర్తింపు లభించడం, పేరు ప్రఖ్యాతులు పెరగడం, ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తండ్రికి కూడా అదృష్టం పడుతుంది. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి.
(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..