Zodiac Sign
శనీశ్వరుడు బద్ధకానికి లేదా సోమరితనానికి కారకుడు. జాతక చక్రంలో కానీ గ్రహచారంలో కానీ శనీశ్వరుడు ఒకటి, నాలుగు, ఏడు, పదవ రాశులలో ఉన్నప్పుడు ఎక్కడా లేని బద్ధకం ఆవరిస్తుంది. శనితో ప్రధాన సమస్య ఈ బద్ధకమే. బద్ధకం కారణంగానే వ్యక్తుల్ని అనేక దుర దృష్టాలు పట్టి పీడిస్తుంటాయి. దీని నుంచి బయటపడితే ఉద్యోగపరంగా ఆర్థికపరంగా అదృష్ట యోగాలు పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం శనీశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నందువల్ల ఈ గ్రహానికి మరింత బలం పట్టడం జరిగింది. ఫలితంగా నాలుగు రాశుల వారు సోమరితనా నికి అలవాటు పడే అవకాశం ఉంది. ఇవి వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. ఈ రాశుల వారు ఏ విధంగా శని కారణంగా సోమరితనం వల్ల నష్టపోయేది ఏ విధంగా లాభ పడటానికి అవకాశం ఉన్నది ఇక్కడ పరిశీలిద్దాం.
- వృషభ రాశి: జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం జాతక చక్రంలో వృషభ రాశి లేదా వృషభ లగ్నం సోమరితనంలో అగ్రస్థానంలో ఉంటుంది. అదృష్టం దానంతటదే తలుపు తడుతుందని ఈ రాశి వారు ఎక్కువగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఉద్యోగ స్థానంలో శని సంచరిస్తూ ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఈ రాశి వారు ఎక్కువగా బద్ధకించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఎక్కువగా శ్రమ పెట్టలేకపోవడం, పని భారాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయడం, మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉన్నా గట్టి ప్రయత్నం చేయకపోవడం, ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టకపోవడం వంటివి కాస్తంత ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నిజానికి దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడు ఉండటం శశ మహాయోగం అనే యోగానికి కారణం అవుతుంది. ఈ రాశి వారు కొద్ది ప్రయత్నంతో ఈ మహా యోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ యోగం 2025 జూలై వరకు కొనసాగుతుంది. అందువల్ల ఈ రాశి వారు ఎంత యాక్టివ్ గా ఉంటే, ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.
- సింహ రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతోంది. ఈ రాశి స్థిరరాశి అయినందువల్ల సహజంగానే బద్ధకం పాలు ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం సంపాదించుకోవడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి, అదనపు ఆదాయ మార్గాలను చేజిక్కించుకోవడానికి అవకాశాలు కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ ఈ రాశి వారు కేవలం మానసిక శారీరక సోమరితనం కారణంగా వీటిని దూరం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కూడా స్థిరత్వం సంపాదించుకోవడానికి, అధికారం చేపట్టడానికి అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రయత్న లోపం, చొరవలేకపోవడం, అనాసక్తత, నిర్లిప్తత వంటి కారణాలవల్ల ఈ యోగాలను అనుభవించడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి శని సప్తమ రాశిలో స్వక్షేత్రంలో ఉండటం కూడా శశ యోగం కిందకే వస్తుంది. పైగా ఈ స్థానంలో శనీశ్వరుడికి దిగ్బలం కూడా పడుతుంది. అంటే ఉద్యోగ పరంగా ఇది చాలా అనుకూలమైన సమయం కింద భావించాల్సి ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నం లేదా చొరవతో ఈ రాశి వారు జీవితంలో అన్ని విధాలుగాను స్థిరపడటానికి అవకాశం ఉందని గ్రహించాలి.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో శని సంచారం జరుగుతోంది. నాలుగో స్థానం అంటే హోదా, సుఖం, ఇల్లు, వాహనం ఆస్తులకు సంబంధించిన స్థానం అన్నమాట. శని స్వక్షేత్రంలో ఉన్నందువల్ల ఈ రాశి వారి మీద అర్థాష్టమ శని ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎదగటానికి ఇది ఎంతగానో అనుకూలమైన సమయం. అయితే, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అవసరమైతే ఇతరులతో సంప్రదించడం చొరవ తీసుకోవడం సరైన విధంగా ప్రయత్నాలు చేయడం వంటి విషయాలలో ఈ రాశి వారు వెనుకబడి ఉండటం వల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతుంటారు. మనసులోని విషయాలను ఇతరులతో పంచుకోవడం ఈ రాశి వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందువల్ల కొన్ని మంచి అవకాశాలను దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజానికి వీరికి యోగాలు పట్టడానికి, మనసులోని కోరికలు నెరవేరటానికి కొద్ది ప్రయత్నం కొద్దిపాటి చొరవ అవసరం అవుతాయి. ఇతరులతో ముఖ్యంగా కుటుంబ సభ్యుల తో సంప్రదించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలిగితే 2025 జూలై లోపల వీరి దశ మారటానికి ఎంతో అవకాశం ఉంది.
- కుంభ రాశి: శనీశ్వరుడు స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం బాగా తగ్గిపోవడమే కాకుండా శశయోగం కూడా పడుతుంది. ఇది ఒక మహా పురుష యోగం. ఈ యోగం పట్టాలంటే తప్పనిసరిగా ప్రయత్నం అవసరం. అయితే ఈ రాశి వారు మనసులోని మాట ఒక పట్టాన బయట పెట్టరు. ప్రతి విషయాన్ని రహస్యంగానే మనసులో ఉంచుకుంటారు. ఈ కారణంగా మామూలు సమయంలో సైతం కొన్ని సదవకాశాలను కోల్పోతూ ఉంటారు. సాధారణంగా కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాల జోలికి పోయే అవకాశం ఉండదు. ఈ రాశి వారికి మార్పు అంటే భయం. ఈ లక్షణాలను కొద్దిగా మార్చుకోగలిగితే వీరి అదృష్టానికి తిరుగు ఉండదు. ఉద్యోగ పరంగా వీరి హోదా పెరగటా నికి, ఆకస్మిక ధన లాభానికి, వీరి ఆర్థిక ప్రయ త్నాలన్నీ సఫలం కావడానికి, ఆస్తిపాస్తులు పెరగ టానికి, ఇల్లు వాహనాలను సమకూర్చుకోవడానికి ఇది ఎంతో అనుకూల సమయం. శని వలలో పడకుండా, సోమరిపోతు సోమరితనాన్ని అలవర్చుకోకుండా ఉంటే వీరంత అదృష్ట వంతులు మరొకరు ఉండకపోవచ్చు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం క్లిక్ చేయండి..