Zodiac Signs: శత్రువుపై విజయం వారిదే.. మీకు శత్రు బాధ పూర్తిగా తొలగేదెప్పుడు?

Astro Tips in Telugu: చాలామందికి శత్రు బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా బంధువుల్లో కూడా ఏదో విధంగా, ఏదో ఒక కారణంగా ఇబ్బంది పెట్టేవారు, చెడు ప్రచారం సాగించేవాళ్లు, గోతులు తవ్వేవాళ్లు ఉంటూ ఉంటారు. శత్రు బాధలు నిత్య జీవితంలో తప్పకపోవచ్చు. ఇవి సాధారణ స్థితిలో ఉంటే ప్రమాదం లేదు కానీ..

Zodiac Signs: శత్రువుపై విజయం వారిదే.. మీకు శత్రు బాధ పూర్తిగా తొలగేదెప్పుడు?
Enemy Zodiac Sign

Edited By:

Updated on: Aug 30, 2023 | 7:33 PM

Enemy Fear Astrology: చాలామందికి శత్రు బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా బంధువుల్లో కూడా ఏదో విధంగా, ఏదో ఒక కారణంగా ఇబ్బంది పెట్టేవారు, చెడు ప్రచారం సాగించేవాళ్లు, గోతులు తవ్వేవాళ్లు ఉంటూ ఉంటారు. శత్రు బాధలు నిత్య జీవితంలో తప్పకపోవచ్చు. ఇవి సాధారణ స్థితిలో ఉంటే ప్రమాదం లేదు కానీ, శ్రుతిమించితే మనశ్శాంతి ఉండదు. నిద్ర పట్టదు. జాతక చక్రంలో లేదా గ్రహ సంచారం ప్రకారం ఈ శత్రు బాధ ఎవరికి ఏ స్థాయిలో ఉంటుంది, దీనికి పరిహారాలేమిటి అనేది ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా ఆరవ స్థానాధిపతిని బట్టి శత్రు బాధను అంచనా వేస్తారు. ఈ ఏడాది ఏ రాశివారికి ఏ స్థాయిలో శత్రు సమస్య ఉంటుందో పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి బుధుడు. ఈ రాశివారికి ప్రతి రంగంలోనూ పోటీదార్లు ఉంటారు. సహోద్యోగుల్లో అసూయాపరులుంటారు. ఈ ఇద్దరితో వీరికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే, ఈ ఏడాది వీరికి చెప్పుకోదగ్గ శత్రువులు ఉండకపోవచ్చు. బుధ సంచారం బాగున్నందు వల్ల, మేష రాశిలో గురువు ఉన్నందువల్ల వీరి మీద శత్రువులు పెత్తనం చేసే అవకాశం ఉండదు. పైపెచ్చు, ఈ రాశివారికి తప్పకుండా శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి రాశ్యధిపతి అయిన శుక్రుడే కావడం ఒక విశేషం. ఈ రాశివారికి ఎక్కువగా బంధువుల్లోనే శత్రువులుండే అవకాశం ఉంటుంది. తల్లి వైపు బంధువులు ఈ రాశి వారి జీవన శైలిని చూసి అసూయపడుతుండడం జరుగుతుంటుంది. అపనిందలు వేసేవాళ్లు, చెడు ప్రచారం సాగించేవాళ్లు కూడా ఉంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కూడా సమస్యలుం టాయి. ఈ ఏడాది శుక్ర గ్రహ సంచారం బాగానే ఉన్నందువల్ల శత్రు బాధ తగ్గు స్థాయిలో ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథునం: శత్రు స్థానాధిపతి కుజుడు అయినందువల్ల ఈ రాశివారికి శత్రు బాధలు కాస్తంత ఎక్కువగానే అనుభవానికి వస్తుంటాయి. ఒక్కోసారి మరీ సమస్యాత్మకంగా కూడా ఉంటుంది. ఉద్యోగంలో కంటే వృత్తి, వ్యాపారాల్లో ఈ శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. పోటీదార్లతో బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఈ ఏడాది కుజుడి బలం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాది శత్రు పీడ
తప్పకపోవచ్చు. మిథున రాశివారికి బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది. అదే వీరిని కాపాడుతుంటుంది.

కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు ఈ రాశినాథుడికి స్నేహితుడే అయినందువల్ల ఎక్కువగా శత్రు బాధ ఉండే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగాలే కాకుండా వ్యాపారాల్లో కూడా శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ రాశివారికి ఈ ఏడాదంతా గురువు ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఉద్యోగంలో పనిభారం పెరగడం, ఒత్తిడి ఉండడం వంటివి మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది.

సింహం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు సప్తమంలో సంచరించడం వల్ల ఈ రాశి వారు శత్రు బాధతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడుగడుగునా వీరికి  ప్రత్యర్థులు, పోటీదార్లు ఎదురవుతుంటారు. ముఖ్యంగా తమ కింద పనిచేసే ఉద్యోగుల నుంచి పోటీ ఎదురవుతుంటుంది. కొందరు బంధువులు పురోగతికి అడ్డుపడుతుండడం జరుగు తుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు అయినందువల్ల ఈ రాశివారు కూడా తగ్గి ఉండే అవకాశం లేదు.

కన్య: ఈ రాశికి శత్రు స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం శత్రు స్థానంలోనే సంచరిస్తున్నందువల్ల పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం పోటీదార్లు ఉండడం జరుగు తుంది. కన్యారాశివారికి శనీశ్వరుడు మిత్ర గ్రహమే అయినందువల్ల ఇబ్బందులు, సమస్యలు సృష్టించినట్టు కనిపించినా చివరికి ఎంతగానో సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి, ఈ ఏడాది శత్రు బాధ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. శత్రు జయం కూడా జరగవచ్చు.

తుల: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు ఏడవ స్థానం నుంచి తులా రాశిని చూస్తుండడం వల్ల తనకంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో తలపడాల్సి వస్తుంది. అంటే వృత్తి, ఉద్యోగాల్లో అధికా రుల నుంచే ప్రమాదం పొంచి ఉంటుంది. వ్యాపారాల్లో తనకంటే పెద్ద వ్యాపారస్థులతో సమస్యలుం టాయి. స్త్రీల నుంచి, రహస్య శత్రువుల నుంచి బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుడు శత్రు బాధ నుంచి వీలైనంత వరకు ఒడ్డున పడేస్తుంటాడు.

వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజ గ్రహమే ఈ రాశికి శత్రువు కూడా. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులు, తోబు ట్టువులు, బంధువులు వీరికి, వీరి పురోగతికి అడుగడుగునా అడ్డుపడుతుంటారు. తప్పులు లెక్క పెడుతుంటారు. అయితే, కుజ గ్రహం ఎదురుదాడికి దిగకుండా మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. ఈ దాడులు, ప్రతిదాడులు ఏడాదంతా అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంటాయి. బహిరంగ శత్రువులే తప్ప రహస్య
శత్రువులు ఉండే అవకాశం లేదు. పైగా ప్రస్తుతం కుజుడు అనుకూలంగా కూడా ఉన్నాడు.

ధనుస్సు: ఈ రాశినాథుడైన దేవ ‘గురువు’ గురు గ్రహానికి రాక్షస గురువైన శుక్రాచార్యుడు బద్ధ శత్రువు. ఆరవ స్థానాధిపతి అయిన శుక్రుడు ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సాధారణంగా శత్రువుల్లో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా పోటీదార్ల రూపంలో చిక్కులు, సమస్యలు సృష్టిస్తుంటారు. అయితే, ఈ ఏడాది శుక్రుడి కంటే గురువు బలం ఎక్కువగా ఉన్నందువల్ల శత్రు బాధ తగ్గి ఉంటుంది.

మకరం: ఈ రాశివారికి బుధుడు శత్రు స్థానాధిపతి. ఈ రాశినాథుడైన శనీశ్వరుడు శత్రుస్థానాధిపతి అయిన బుధుడి కంటే బలంగా ఉన్నందువల్ల శత్రువులది పైచేయి అయ్యే అవకాశం లేదు. సాధారణంగా వృత్తి, ఉద్యోగాల్లోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ శత్రువులు కూడా ముఖాముఖీ ఎదు ర్కునే అవకాశం ఉండదు. తెర వెనుక కార్యకలాపాలతో ఇబ్బంది పెడుతుంటారు. శనీశ్వరుడు బలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది మాత్రం మకర రాశివారిని ఏ శత్రువూ జయించే అవకాశం ఉండదు.

కుంభం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన చంద్రుడు శత్రువు. అయితే, ఈ రాశి అధిపతి అయిన శనీశ్వరుడి కంటే చంద్రుడు బాగా బలహీనుడు కాబట్టి శత్రు పీడ ఎక్కువగా ఉండే అవకాశం లేదు. శత్రువుల ప్రయత్నాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండదు. ఈ రాశివారికి స్త్రీల బాధ ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్త్రీ ఉద్యోగుల నుంచి పోటీ ఉండడమో, వారి ద్వారా సమస్యల్లో ఇరుక్కోవడమో జరుగుతుంటుంది. ఈ ఏడాది మాత్రం అటువంటి సూచనలేవీ లేవు.

మీనం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి రవి గ్రహం అయినందువల్ల సాధారణంగా అధికారుల నుంచి ఈర్ష్యాసూయలు వ్యక్తం అవుతూ ఉంటాయి. వీరికి అధికారులే పోటీదార్లుగా, శత్రువులగా మారే అవకాశం ఉంటుంది. అయితే, రవి కన్నా ఈ రాశి నాథుడైన గురువు బలంగా ఉన్నందువల్ల శత్రువులు లొంగి ఉండే లేదా తగ్గి ఉండే అవకాశమే కనిపిస్తోంది. తండ్రి గానీ, తండ్రి వైపు బంధువులు గానీ శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.

ప్రధానమైన పరిహారాలు: ఈ రాశివారైనప్పటికీ శత్రు బాధ మరీ ఎక్కువగా ఉండే పక్షంలో ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల శత్రువుల మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. పుష్యరాగం లేదా కెంపుతో ఉంగడం చేయించుకుని ధరించడం వల్ల తప్పకుండా శత్రు పీడ తగ్గే అవకాశం ఉంటుంది.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.