Astro Remedy
సెప్టెంబర్ నెలంతా ప్రధానమైన శుభ గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అయిదు రాశుల వారికి కొద్దిపాటి పరిహారాలు అవసరమవుతున్నాయి. మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా కొన్ని ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశుల వారు తప్పని సరిగా పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. పరిహారాల వల్ల సమస్యల ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రాశులవారు ప్రధానంగా ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని మరింత శ్రద్దగా అర్చించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్దిస్తాయి.
- మిథునం: బుధుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు వినాయకుడిని అర్చించడం వల్ల అనేక ఒడిదుడుకుల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. ధన కారకుడైన గురువు వ్యయ స్థానంలో ఉండడంతో పాటు ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల రావలసిన డబ్బు సకాలంలో అందకపోవడం, డబ్బు నష్టపోవడం, మోసానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వీటి నుంచి బయటపడాలన్న పక్షంలో మరకతం పొదిగిన ఉంగరం ధరించడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు నీచపడడంతో పాటు, ఉద్యోగ స్థానాధిపతి కుజుడు వ్యయ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు లేనప్పటికీ, మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు దుర్గాదేవిని స్తుతించడంతో పాటు ముత్యం పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ సమస్యల నుంచే కాక మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా సజావుగా సాగుతుంది.
- కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉండడం, ధన, భాగ్యాధిపతి శుక్రుడు నీచ బడడం వల్ల ఊహించని ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వ కపోవడం, మీరు ఇవ్వాల్సిన వారు ఒత్తిడి తీసుకు రావడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివా దాలు కూడా ఇబ్బంది పెడతాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. వీటికి పరిహా రంగా మరకతం పొదిగిన ఉంగరం ధరించడం, లలితా సహస్ర నామం చదువుకోవడం చాలా అవసరం.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల వేధింపులు కూడా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆస్తి వివాదాలు చికాకు పెడతాయి. మనశ్శాంతి తగ్గుతుంది. వీటి నుంచి బయటపడడానికి స్కంద స్తోత్రం లేదా కాలభైరవాష్టకం పఠించడం మంచిది. పగడపు ఉంగరం ధరించడం చాలా మంచిది.
- మీనం: రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండడం, వ్యయ స్థానంలో శని, సప్తమంలో నీచ శుక్రుడు ఉండడం వల్ల ఒక పట్టాన ఏ ప్రయత్నమూ కలిసి రాక, ఏ పనీ పూర్తి కాక ఇబ్బంది పడడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు కూడా మందకొడిగా సాగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. వీటి నుంచి విముక్తి పొందా లన్న పక్షంలో పుష్యరాగంలో ఉంగరం ధరించడంతో పాటు, స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి