Zodiac Signs
మేషరాశిలో బుధ. రాహు గ్రహాలు కలిసి ఉండటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలలో సరికొత్త చొరవ, ఊపు, తెగింపు, సాహసం, కృత నిశ్చయం వంటివి చోటు చేసుకుంటాయి. సమస్యల నుంచి బయటపడటానికి, కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం కావటానికి ఏదో ఒకటి చేయాలనే తెగింపు చోటు చేసుకుంటుంది. సాధారణంగా ప్రాణాంతకమైన సాహస కృత్యాలకు ఈ కలయిక అవకాశం కల్పిస్తూ ఉంటుంది. నిజ జీవితంలో కూడా ఏదో ఒకటి చేసి, సమస్యల నుంచి బయటపడాలని, చావో, బతుకో తేల్చుకోవాలని మనసులో దృఢ సంకల్పం కలుగుతుంది. ముఖ్యంగా చర రాశుల యిన మేష, కర్కాటక, తుల, మకర రాశి వారిలో గట్టి నిర్ణయాలు పట్టుదల, తెగింపు వంటివి తప్పకుండా చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేష రాశి: ఈ రాశిలో బుధ, రాహులు సంచరించడం వల్ల ఈ రాశి వారి మానసిక ధోరణిలో ప్రగాఢమైన మార్పు చోటు చేసుకుంటుంది. కోపతాపాలు పట్టుదలలు ఆవేశ కావేషాలు కాస్తంత అధికంగా వ్యక్తం అవుతుంటాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద వీరు దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. జూన్ ఆరవ తేదీ వరకు రాహువుతో బుధుడు కలిసి ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ లోగా వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఈ రాశి వారు ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. వీరు తప్పకుండా తమ ప్రయత్నాలలో విజయం సాధించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలతో పాటు ఒకటి రెండు ఉద్యోగ వ్యాపార కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో బుధ, రాహు గ్రహాల కలయిక కొనసాగు తున్నందువల్ల ఉద్యోగ పరంగా కొన్ని సమస్యల విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడటం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలనం, ఉద్యోగంలో మార్పు వంటి విషయాలలో కాలయాపన జరగటం ఇష్టం లేక వీరు అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధపడతారు. ఉద్యోగ సంబంధంగా ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ వీరు వాటిపై పోరాటం ప్రారంభిస్తారు. ఈనెల 20వ తేదీ తరువాత వీరి సమస్యల కు పరిష్కారం లభించే అవకాశం ఉంది. నిజానికి వీరికి ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి ఇది ఎంతో అనుకూల సమయం. కోర్టు కేసులు సైతం వీరికి అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
- తులా రాశి: ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల పరంగా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న వివాదాలు సమస్యలు ఇబ్బందులపై ఈ రాశి వారు పోరాటం ప్రారంభించడం మొదలవుతుంది. ఈ రాశి వారిని గట్టి పట్టుదల, తెగింపు ధోరణి ఆవహించడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, వ్యాపార భాగస్వామ్య సమస్యల మీద ఈ రాశి వారు దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాల విషయంలో కూడా అటో ఇటో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మనసులోని కోరికలను ఏదో విధంగా తీర్చుకునేందుకు గట్టిగా కృషి చేస్తారు. ఆస్తి సంబంధమైన వివాదాలు, సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అత్యవసరంగా పరిష్కరించుకోవడం మంచిదని భావిస్తారు. వీటి పరిష్కారానికి నడుం బిగిస్తారు. సాధారణంగా జూన్ 6వ తేదీ లోపునే వీరు ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
- మకర రాశి: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో బుధ రాహువుల కలయిక కొనసాగుతున్నందువలన వృత్తి, ఉద్యోగాలు, గృహ, వాహన యోగాలకు సంబంధించి చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, వివాదాలు, ప్రయత్నాలను అతి త్వరగా పరిష్కరించుకోవడానికి సిద్ధపడతారు. గట్టి పట్టుదలకు మొండితనానికి మారుపేరైన మకర రాశి వారు మరింత దృఢ సంకల్పంతో ఈ సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తారు. కొత్త ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో మార్పు, ఇల్లు లేదా వాహనం కొనుగోలుకు సంబంధించిన సమస్యలు వీరి దృష్టిలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. వృత్తిలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు వంటివి వీరి ప్రయత్నాల వల్ల అతి త్వరలో సఫలం కావడానికి అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు జూన్ మొదటి వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..