AP Panchayat Elections 2021 Nominations Updates: ఆంధ్రాలో ముగిసిన తొలి రోజు నామినేషన్ల పర్వం..
అన్ని కోర్టు సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల విడుదలచేసింది. దీంతో ఇవాళ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల తొలిరోజు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 31 వరకు నామినేషన్లకు అవకాశమున్న విషయం తెలిసిందే. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 4ను చివరి తేదీగా ప్రకటించింది. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 9న జరగనున్న విషయం తెలిసిందే. తొలి విడతో భాగంగా రాష్ట్రంలోని 168 మండల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారమంతా వైసీపీ నాయుకులు, నిమ్మగడ్డ రమేష్‌ల మధ్య వాగ్వాదం కొనసాగిన విషయం తెలిసిందే. ఏకగ్రీవాలపై భద్రత పెంచుతాం అంటూ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
LIVE NEWS & UPDATES
-
టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘పంచాయతీ ఎన్నికలు గేమ్ ఛేంజర్స్ ఎలక్షన్స్’ అని అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం టీడీపీ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
-
రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉంది: నిమ్మగడ్డ
ప్రస్తుతం కర్నూలు పర్యటనలో ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉందంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవ ప్రకటనల వెనక కుట్ర ఉందని ఫిర్యాదులు వచ్చాయని నిమ్మగడ్డ అన్నారు. ఏకగ్రీవాలపై ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. ఏకగ్రీవ ప్రకటన చేసిన వారు సంజాయిషీ ఇవ్వాలని.. వారిపై చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు. ఏకగ్రీవాల విషయంలో షాడో టీమ్‌లు, నిఘా కెమెరాలు, ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు.
-
-
ఏకగ్రీవాల ప్రకటనపై చర్యలు తీసుకుంటాం: నిమ్మగడ్డ
రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాసేపటి క్రితం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కర్నూలులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీల ఏకగ్రీవాల ప్రకటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎస్ఈసీకి తెలియకుండా ఇలాంటి ప్రకటనలు ఎలా ఇస్తారని మండి పడ్డారు. రాష్ట్రంలో జరుగుతోన్న ఏకగ్రీవాలపై వివిధ పార్టీల నేతలు గవర్నర్‌ను కలిశారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా చూడాలని తెలిపారు. బలవంతం చేసి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయడం మంచిదికాదంటూ చెప్పుకొచ్చారు. మంచి వాతావరణాన్ని కలుషితం చేయొద్దన్నారు. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొనాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు.
-
ఫిబ్రవరి 1,2 తేదీల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన..
రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం ఫిబ్రవరి 2న విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.
-
ఏకగ్రీవ పంచాయతీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: నిమ్మగడ్డ
ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్లు మొదలైన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవాలపై రాజకీయ ఒత్తిళ్లు చేసేవారి మీద నిఘా పెట్టే షాడో టీంలను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీలను సున్నిత ప్రాంతాలుగా పరిగణించి నిఘా ఉంచాలని నిమ్మగడ్డ సూచించారు. అంతేకాకుండా అన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమని స్పష్టం చేశారు.
-
-
నిమ్మగడ్డ చంద్రబాబు ఏజెంట్‌లా పనిచేస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్‌లా పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నిమ్మగడ్డ నమ్మకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీడీపీ గూండాలను పెట్టుకుని ఎన్నికలను జరుపుకుంటారా.. అంటూ సజ్జల ప్రశ్నించారు. నిమ్మగడ్డ నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని, ఎన్నికలను సజావుగా జరపడం ఎస్‌ఈసీ బాధ్యత అని గుర్తుంచుకోవాలని చెప్పారు.
-
రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు నియామకం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి కె.కన్నబాబును నియమిస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కన్నబాబుకు విపత్తుల నిర్వహణ శాఖతో పాటు మత్స్య శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను సూచించగా… ఎన్నికల కమిషనర్ కన్నబాబును ఎస్ఈసీ కార్యదర్శిగా ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
-
నిమ్మగడ్డ వ్యాఖ్యలపై ఫైర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి..
మంత్రులపై నిమ్మగడ్డ రమేష్ చేసిన వ్యాఖ్యలపై, తనను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాయడంపై సజ్జల ఫైర్ అయ్యారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ స్థానంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఎస్‌ఈసీ వ్యవస్థ సంయమనంతో ఉండాలని సజ్జల చెప్పారు.
-
సుప్రీం కోర్టుకు తీర్పుకు మంత్రులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ అన్న రేంజ్‌లో సాగుతోన్న ఎపిసోడ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వైసీపీ నాయుకులపై విమర్శలు కురిపించారు. వైసీపీ మంత్రులు సుప్రీం కోర్టుకు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పదవిలో ఉన్న సజ్జల నాపై రాజకీయ దాడి చేశారన్నారు. విజయసాయి రెడ్డి కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని నిమ్మగడ్డ ఆరోపించారు. ఈ విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని నిమ్మగడ్డ లేఖ రాశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కూడా నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
-
మేము మార్చిలోనే ఎన్నికలకు సిద్ధమయ్యాము: మంత్రి పేర్నినాని
చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుందన్న విమర్శలపై వైసీపీ నాయకుడు మంత్రి పేర్నినాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, మార్చిలోనే ఎన్నికలకు సిద్ధమయ్యామని చెప్పారు. ఏకగ్రీవాలు గతం నుంచి వస్తున్న ఆచారమే కొత్తగా మేము చెప్పిందని కాదని తెలిపారు. చంద్రబాబు మంతిమరుపు రోగంతో బాధపడుతున్నారని, పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటని నాని విమర్శలు గుప్పించారు.
-
ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు: విజయసాయి రెడ్డి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై స్పందిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించిన విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏకపక్షంగా ఎన్నికలు నిలిపివేశారని, చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులుండవు, కానీ 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి మేనిఫెస్టో విడుదల చేశారు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనరా లేదా టీడీపీ ఎన్నికల కమిషినరా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
-
చంద్రబాబుపై ఎస్ఈసీకి ఫిర్యాదు..
ఏపీలో ఇవాళ్లి నుంచి తొలి విడత నామినేషన్స్ మొదలైన తరుణంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఏకంగా మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసీపీ లిగల్ సెల్ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌కు మేనిఫెస్టో విరుద్దమని ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
వైసీపీ నేతల తీరుపై గవర్నర్ ఆగ్రహాం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి తీరుపై ఎస్ఈసీ సీరియస్‌గా ఉన్నారు. వారి తీరును తప్పుబడుతూ ఏకంగా గవర్నర్ హరిచందన్‌కే లేఖ రాశారు. వీరిలో అందరి కన్నా… సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేలా తనపై రాజకీయ దాడి చేశారన్నది నిమ్మగడ్డ ఆగ్రహానికి కారణమైంది.
-
చీరాల మండలంలో 17 పంచాయతీల ఎన్నికలు నిలిపివేత
చీరాల మండలంలోని 17 పంచాయతీల ఎన్నికలు నిలిచిపోయాయి. మండలంలోని గ్రామపంచాయతీలను విభజన చేసి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, పంచాయతీల విభజనపై కొంత మంది హైకోర్టును అశ్రయించారు. దీంతో కోర్టు ఆ పంచాయతీల విభజనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో చీరాల మండలంలో వచ్చేనెల 9వతేదీన జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి.
-
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేః శైలజానాథ్
స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని చూడటం సరికాదన్నారు పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపైన ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలు వల్ల దేశంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
-
నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న తెనాలిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్ సందర్శించారు. 4 గ్రామ పంచాయతీలకు గాను ఎండిఓ ఆఫీస్ కార్యాలలో నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు.
-
అనంతపురం జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అనంతపురం కలెక్టరేట్ కు చేరుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ సత్య ఏసుబాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రెవెన్యూ భవన్ లో సమీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డీఎస్పీలు, జడ్పీ సీఈఓ, డీపీఓలు, ఆర్డీఓలు పాల్గొన్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో అనుసరిస్తున్న వైఖరిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. అలాగే ఎన్నికల ఏర్పాట్లపై ఆయన నిమ్మగడ్డ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
-
సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ గవర్నర్‌కు ఎస్ఈసీ లేఖ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో లేఖాస్త్రం సంధించారు. అధికారులే కాదు… ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని ఏకంగా గవర్నర్‌కు లేఖ రాశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు లేఖ రాశారు. గతంలో కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించారు. మొన్నటి ద్వివేది, గిరిజా శంకర్‌లపై అభిశంసనకు ప్రతిపాదించారు. ఇవాళ ప్రవీణ్ ప్రకాష్‌ను పక్కన పెట్టాలని సీఎస్‌ను ఆదేశించారు.
-
అనంతరపుం బయలుదేరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ ఉదయం విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకున్న ఆయన… అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురంకు పయనమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఐజీ ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లాలో తీసుకున్న చర్యలపై సమావేశంలో నిమ్మగడ్డ సమీక్షించనున్నారు.
-
అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరు
అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 169 పంచాతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయ 11 గంటల నుంచే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు కార్యాలయానికి చేరుకుంటున్నారు.
-
గ్రామ సర్పంచ్ బరిలో మహిళా వలంటీర్
ఉత్తమ సేవలందిస్తున్న ఓ మహిళా వలంటీర్‌ను గ్రామస్తులు సర్పంచ్ బరిలో నిలిపారు. డిగ్రీ పూర్తి చేసిన సత్యవతి రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లిలో వలంటీర్ పోస్టుకు ఎంపికైంది. వలంటీర్ ఉద్యోగం రావడంతో సత్యవతి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుండేది. ఆమె సేవలను గుర్తించిన మండల స్థాయి అధికారులు ఉత్తమ మండల వలంటీర్ అవార్డును ప్రకటించారు. గ్రామ వలంటీర్‌గా ఉన్నప్పుడే సత్యవతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందు వరసలో ఉంటుందని గ్రహించిన గ్రామస్తులు ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచ్‌గా బరిలో దింపారు.
-
తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ
విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ, పెద్దాపురం
పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం
కృష్ణా జిల్లా: విజయవాడ
గుంటూరు జిల్లా: తెనాలి
ప్రకాశం జిల్లా: ఒంగోలు
నెల్లూరు జిల్లా: కావలి
కర్నూలు జిల్లా: నంద్యాల, కర్నూలు
అనంతపురం జిల్లా: కదిరి
కడప జిల్లా: జమ్మలమడుగు, కడప, రాజంపేట
చిత్తూరు జిల్లా: చిత్తూరు
-
ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఎస్ఈసీ లేఖ..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.
-
ఎన్నికల సంఘం కార్యదర్శిగా రవిచంద్ర నియామకం వివాదాస్పదం
పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం కమిషన్ పనితీరుపై ప్రభావం చూపుతోందని ముగ్గురు అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూసిన రవిచంద్రను కార్యదర్శిగా నియమిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.
-
రాయలసీమ పర్యటనకు ఎస్ఈసీ
నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందా..? ఎక్కువ శాతం ఏకగ్రీవాలకే మొగ్గు చూపుతారా..? అధికార, విపక్ష నేతల మధ్య మాటలయుద్ధం ఎంతవరకూ వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. రాయలసీమలో చిత్తూరు మనహా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తారు. కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సమావేశమై సమీక్షిస్తారు.
-
కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలి విడత ఎన్నికలు
తూర్పుగోదావరి జల్లాలో 366 గ్రామ పంచాయతీల ఎన్నికలకు తొలివిడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలోని 20 మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. 85 గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
మొదటి దశలో ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలు… 366
వార్డులు ….. 4100
పోలింగ్ స్టేషన్లు …… 4,202
ఓటర్లు …….. 10,61,529
-
ఆన్‌లైన్ నామినేషన్‌కు పెరుగుతున్న డిమాండ్
ఏపీలో కొత్తగా ఆన్‌లైన్ నామినేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రత్యక్షంగా అయితే బెదిరింపులు ఉంటాయి.. అందుకే .. ఆన్‌లైన్‌లో నామినేషన్లను స్వీకరించాలంటున్నాయి బీజేపీ, జనసేన. ఇదే డిమాండ్‌తో గవర్నర్ హరిచందన్‌ను కలిశారు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్. అయితే అది సాధ్యమయ్యే ప్రక్రియేనా అని ప్రశ్నించారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
-
ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారుల నియామకం
ఏపీలో 33,496 వార్డు సభ్యుల స్థానాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రస్తుతం 992 వార్డులు తగ్గాయి. పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారులను, మిగతా చోట్ల సహాయ రిటర్నింగ్, స్టేజి-1 అధికారులను కలెక్టర్లు నియమించారు.
-
తిమ్మాపురంలో ఓటర్ల జాబితా గందరగోళం
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం తిమ్మాపురంలో ఓటర్ల జాబితా గందరగోళంగా మారింది. గ్రామ జనాభా మొత్తం 207 కాగా, 317 ఓటర్లతో జాబితా సిద్ధం చేశారు. గ్రామానికి చెందినవారివి 21 ఓట్లు తొలగించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో అధికారులు ఓట్లు తొలగించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
13 గ్రామ పంచాయతీల్లో నిలిచిన ఎన్నికలు
రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 90చోట్ల బ్రేకులు పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో కారణం కనిపిస్తోంది. కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.
-
కుల ధృవీకరణ పత్రాలపై ఆ ఫోటో ఉండకూడదుః ఎస్ఈసీ
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు, సీఎస్ నిమ్మగడ్డ లేఖాస్త్రం సంధించారు. కుల ధృవీకరణ, ఎన్ఓసీ పత్రాల మీద జగన్ ఫోటోలు తీసేయాలని ఆదేశించారు. ఈ టైమ్‌లో తహసీల్దార్లు ఇచ్చే ఈ పత్రాలపై జగన్ ఫోటో ఉండడం నియమావళికి విరుద్దమన్నారు. ఉన్నపళంగా మండలాల్లో తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని సూచించారు. అదే టైమ్‌లో అభ్యర్థులకు జారీ చేయాల్సిన నోఅబ్జక్షన్, కులదృవీకరణ పత్రాల్లో జారీ వద్దని కూడా ఆదేశించారు.
Published On - Jan 29,2021 9:00 PM