Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siraj: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన సిరాజ్‌! ఒక్క మాటతో ఇచ్చిపడేశాడు..

మొహమ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, పాత బంతితో సిరాజ్ ప్రభావం తక్కువని పేర్కొన్నారు. సిరాజ్ ఈ ఎంపికపై స్పందిస్తూ, సెలక్షన్ తన చేతుల్లో లేదని, తన దృష్టి ఇప్పుడు ఐపీఎల్ మీద ఉందని తెలిపారు. అతను తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడానికి కష్టపడుతున్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఆడుతున్న క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్రా సహాయం పొందుతున్నాడు.

Siraj: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన సిరాజ్‌! ఒక్క మాటతో ఇచ్చిపడేశాడు..
Siraj
Follow us
SN Pasha

|

Updated on: Mar 21, 2025 | 7:28 AM

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేయలేదనే విషయం తెలిసిందే. కొత్త బాల్‌తో ఎఫెక్టివ్‌గా ఉంటున్న సిరాజ్‌, పాత బాల్‌తో అంతే ప్రభావం చూపలేకపోతున్నాడంటూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయంతో జట్టుకు దూరమైనా.. అతని స్థానంలో కొత్త బౌలర్‌ హర్షిత్‌ రాణాను తీసుకున్నారు కానీ, సిరాజ్‌ను కన్సిడర్‌ చేయలేదు. పైగా వన్డే ఫార్మాట్‌లో సిరాజ్‌కు అద్భుతమైన రికార్డ్‌ ఉంది. వరల్డ్‌ టాప్‌ 5 వన్డే బౌలర్లలో సిరాజ్‌ ఒకడు. అయినా కూడా టీమిండియా సెలెక్టర్లు అతన్ని వద్దనుకున్నారు. సిరాజ్‌ను పక్కనపెట్టడంపై చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఏకంగా నలుగురు స్పిన్నర్లతో ఆడి ట్రోఫీ సాధించడంతో ఆ తర్వాత సిరాజ్‌ను పక్కనపెట్టిన అంశం పెద్దగా హైలెట్‌ కాలేదు. కానీ, తాజాగా సిరాజ్‌ తనను ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని విషయంపై స్పందించాడు. సిరాజ్‌ మాట్లాడుతూ.. “సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు, నా చేతుల్లో కేవలం బాల్‌ మాత్రమే ఉంది. నేను ఏదైనా చేయాలనుకుంటే దాంతోనే చేయాలి. ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, నాపై నేను ఒత్తిడి పెంచుకోలేను. ఇప్పుడు నా ఫోకస్‌ మొత్తం ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి, గుజరాత్‌ మరో టైటిల్‌ గెలవడంతో వారికి సహాయపడటమే” అని అన్నాడు.

ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా సిరాజ్‌ను ఎంపిక చేయలేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో సిరాజ్‌కు రెస్ట్‌ ఇచ్చారని అంతా భావించారు. కానీ, అతన్ని పక్కపెట్టారనే విషయం ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన తర్వాత తెలిసిందే. కాగా, తనకు దొరికిన ఈ బ్రేక్‌లో తన బౌలింగ్‌ను మరింత మెరుగుపర్చుకోవడానికి శ్రమించినట్లు సిరాజ్‌ పేర్కొన్నాడు. ముఖ్యంగా స్లోవర్‌ బాల్స్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. అలాగే న్యూ అండ్‌ ఓల్డ్‌ బాల్స్‌తో మెరుగైన బౌలింగ్‌ చేయడంపై వర్క్‌ చేసినట్లు తెలిపాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఆడుతున్న క్రమంలో ఆ జట్టు హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కోచింగ్‌ సిరాజ్‌కు బాగా హెల్ప్‌ అవుతుందని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సీజన్‌లో సిరాజ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..