AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: అరకు వైసీపీలో ఏం జరుగుతోంది.. రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి.. చర్చలు ఫలించేనా..?

అరకు వైసీపీలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు మంటలు రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలోఅరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గొడ్డేటి మాధవి నియామకం స్థానిక నేతల్లో ఆగ్రహానికి దారి తీసింది. పార్టీ కోసం పని చేసిన స్థానికులకు కాదని, స్థానికేతరాలైన మాధవిని సమన్వయకర్తగా నియమించడంతో సొంత పార్టీ శ్రేణులే ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాల క్రమంలో అరుకులో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించాలని వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారు సీఎం జగన్.

YSRCP: అరకు వైసీపీలో ఏం జరుగుతోంది.. రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి.. చర్చలు ఫలించేనా..?
Yv Subbareddy
Srikar T
|

Updated on: Jan 11, 2024 | 10:00 AM

Share

అరకు వైసీపీలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు మంటలు రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలోఅరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గొడ్డేటి మాధవి నియామకం స్థానిక నేతల్లో ఆగ్రహానికి దారి తీసింది. పార్టీ కోసం పని చేసిన స్థానికులకు కాదని, స్థానికేతరాలైన మాధవిని సమన్వయకర్తగా నియమించడంతో సొంత పార్టీ శ్రేణులే ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాల క్రమంలో అరుకులో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించాలని వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారు సీఎం జగన్. ఇంతకీ అరకులో ఏం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలు ఓ లెక్క.. ఆ నియోజకవర్గం మరోలెక్క. అరకు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి పెద్ద టాస్క్‌గా మారింది. 2014, 19లో వైసీపీ ఇక్కడ ఘన విజయం సాధించినా.. నాన్‌ లోకల్ ఎమ్మెల్యే, బలమైన సామాజిక వర్గం నేత కాదన్న విషయం.. అధికారపార్టీని కలవరపెడుతోంది. అందుకే.. అరకు ఎంపీని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని.. ఆమెకే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలో కొండ దొరలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవడంతో.. కొండ దొరలకు చెందిన.. మాధవిని ఇక్కడి నుంచి రంగంలోకి దించింది వైసీపీ.

అరకులో మొత్తం 2 లక్షల 25 వేల ఓటర్లు ఉండగా సంఖ్యాపరంగా కొండ దొరలు, వాల్మీకులు మరియు భగతులు అనే మూడు గిరిజన ఉప కులాలు ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. అరకులో ఎక్కువగా ఉన్న కొండ దొరలు సాంప్రదాయకంగా వామపక్ష మద్దతుదారులు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ సానుభూతి పరులుగా మారడం, కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లుగా ఉండే భగతులు కూడా 2014, 2019లలో వైసీపీ వైపు మొగ్గు చూపడంతో అక్కడ ఏకపక్షంగా ఎన్నిక జరుగుతూ వస్తోంది. అయితే కొండ దొర సామాజిక వర్గంలో నాయకత్వం పెద్దగా ఎదగకపోవడం, అక్కడ బలమైన నాయకులు లేకపోవడం, వాల్మీకి సామాజిక వర్గ నేతలు సంఖ్యా పరంగా తక్కువగా ఉన్నా చురుకైన నాయకత్వం ఉండడంతో కిడారి సర్వేశ్వర రావు, చెట్టి ఫాల్గుణ లాంటి నేతలు అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం హిస్టరీని ఒక్కసారి పరిశీలిస్తే..2009లో 402 ఓట్లతో టీడీపీ అభ్యర్థి సివెరి సోమా గెలుపొందగా.. 2014లో అదే సివేరి సోమాపై.. వైసీపీ అభ్యర్ధి కిడారి సర్వేశ్వర రావు 35 వేల మెజారిటీ సాధించారు. 2019లో కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ టీడీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం కాగా.. వైసీపీ అభ్యర్ధి చెట్టి ఫాల్గుణ 25వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఫాల్గుణ, అంతకుముందు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కూడా.. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం విశేషం. అయితే ఈసారి కొండ దొరలకు అవకాశం కల్పించాలని వైసీపీ నిర్ణయించింది.

స్థానికంగా కొండ దొరలలో బలమైన నేత లేకపోవడంతో.. అరకు ఎంపీ.. గొడ్డేటి మాధవిని తీసుకొచ్చి అరకుకు సమన్వయకర్తగా నియమించింది అధిష్ఠానం. మాధవిది పాడేరు నియోజకవర్గం కావడంతో అరకులో స్థానిక నేతలకే అవకాశం ఇవ్వాలని.. స్థానిక నాయకత్వం ఆందోళన చేస్తోంది. అది రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుతుండడంపై పార్టీ దీనిపై దృష్టి సారించింది. సాధారణంగా ఎస్టీ నియోజకవర్గాల్లో స్థానికత పెద్ద అంశం కాదు కానీ.. ఈసారి జరుగుతున్న పరిణామలపై క్షేత్ర స్థాయి పరిస్థితి తెలుసుకునేందుకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించింది. రేపు ఆయన అరకు వెళ్తున్నారు. అయితే మళ్లీ పోటీ చేయాలన్న ఆశతో ఉన్న అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణనే ఈ నిరసనలకు కారణమని పార్టీకి నివేదికలు అందడంతో.. ఆయనతో మాట్లాడనున్నారు వైవీ. ఫాల్గుణకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా నిరసనలు చేస్తుండటంపై పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఒక వేళ నిజంగా మాధవిపై వ్యతిరేకత ఉందని తేలితే.. అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలరాజును బరిలో దింపి ఫాల్గుణకు చెక్ పెట్టే అవకాశం ఉంది. బాలరాజు కూడా స్థానికుడు కాకపోయినా మాజీ మంత్రిగా ఆ ప్రాంతంతో మమేకం అయ్యి ఉండడం కలిసి వచ్చే అంశం. గిరిపుత్రులు కూడా.. సామాజిక వర్గ ప్రాధాన్యత కంటే వైసీపీకి అనుకూలంగా ఉండే వారి కోసం చూస్తుండటంతో.. అధికార పార్టీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సుబ్బా రెడ్డి పర్యటన ఆసక్తిగా మారనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..