వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలకు జగన్ వ్యాఖ్యానించారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని.. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడని కార్యకర్తలు ఓపికగా ఉండాలని జగన్ అన్నారు. మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడటం బాధాకరమని..ఆయన విషయంలో పార్టీ ఎప్పుడూ తప్పు చేయలేదని.. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చామని, మండలి రద్దు చేయాలనుకున్నప్పుడు సైతం.. రాజ్యసభకు కూడా పంపామని జగన్ గుర్తు చేశారు. రేపల్లె ఇన్‌చార్జ్ ఈవూరు గణేష్‌కు కార్యకర్తలు మద్దతుగా ఉండి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని జగన్ కోరారు.
ఐదేళ్ల పాలనలో ప్రతి వైసీపీ కార్యకర్త గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశామని జగన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్ చేశామని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, వైసీపీకి ఓటు వేయనివారికి కూడా మంచి చేశామని జగన్ అన్నారు. ఇవాళ టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉందని, చంద్రబాబు అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని, టీడీపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజాసమస్యలపై పోరాడాలని జగన్ పిలుపు ఇచ్చారు.
మోపిదేవి వెంకట రమణ వైసీపీని వీడి టీడీపి గూటికి చేరడంపై కూడా వైఎస్ జగన్ స్పందించారు. మోపిదేవి రమణ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కేబినెట్‌లో చోటిచ్చి గౌరవించానని.. ఆ తర్వాత రాజ్యసభకి కూడా పంపానని గుర్తుచేశారు. పదవీకాలం ముగిశాక మరోసారి పంపమన్నా.. ఈసారి గెలిచి ఉంటే రాజ్యసభకి పంపేవాడ్ని అన్నారు. ఎక్కడా తాము తప్పు చేయలేదని.. మంచి చేస్తే దేవుడు మనకు మంచే చేస్తాడని అన్నారు.