Andhra Pradesh: వైసీపీలో అజ్ఞాతాన్ని వీడి బయటకు వస్తున్న తాజా మాజీలు.. కారణం అదేనా..?

| Edited By: Balaraju Goud

Jan 11, 2025 | 4:59 PM

ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులతో హడావుడి చేసిన వైసీపీ గట్టిగానే చేతులు కాల్చుకుంది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌తో.. ఆ మార్పులకు మళ్లీ మార్పులు చేస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా పార్టీల సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్లంతా బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నారు.

Andhra Pradesh: వైసీపీలో అజ్ఞాతాన్ని వీడి బయటకు వస్తున్న తాజా మాజీలు.. కారణం అదేనా..?
Ycp Leaders
Follow us on

వైసీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా అజ్ఞాతాన్ని వీడుతున్నారు. ఆరు నెలల కాలంగా సైలెంట్‌గా ఉన్న సీనియర్లంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు జగన్ ఆదేశాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లా పార్టీల సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్లంతా బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నారు.

మాజీ మంత్రి అంబటి, రోజా, బుగ్గన కారుమూరు, నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ,బొత్స సత్యనరాయణ లాంటి సీనియర్లు అంతా వారం రోజుల వ్యవధిలో బయటకు వచ్చారు. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌ పని చేయాలని చెప్పడంతో అందులో భాగంగానే సీనియర్లు మొత్తం ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఎన్నికల తరువాత నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ గ్రామాలను విడిచి వెళుతున్న స్పందించని నియోజకవర్గ ఇంచార్జీలు, మాజీ మంత్రులు, ఎంపీలు అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి వచ్చారు. దీంతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చర్చ పార్టీలో జోరుగా నడుస్తుండగా దాని వెనుక వేరే కారణాలు ఉన్నాయని, ఇప్పటివరకు బయటికి రాని సీనియర్లంతా తెర ముందుకు రావడానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేస్తున్న మార్పులేనన్న చర్చ ఇంకోవైపు నడుస్తోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనాపరమైన అంశాలు వైఫల్యాల విషయంలో కొంత సమయం ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. పరిపాలనా పరమైన అంశాల విషయాన్ని పక్కన పెట్టిన సొంత పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల అంశంలో స్పందించాల్సిన తీరులో పార్టీ సీనియర్లు ఎక్కడా కూడా ముందుకు రాలేదు. దీంతో నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో జరిగిన దాడులు హత్యాయత్నాలు కేసులు లాంటి అంశాల విషయంలో స్వయంగా పర్యటనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే కొంతమంది నేతలు ఓటమి తర్వాత నియోజకవర్గ వైపు సైతం కన్నెత్తి కూడా చూడలేదని అటువంటి పరిస్థితులు పార్టీలో పునరావృతం కాకూడదని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టారు. రాష్ర్ట ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అందరి నేతలతో భేటీ అవడంతో పాటు ఆయా జిల్లాల్లోని పార్టీ పరిస్థితుల పైన ప్రత్యేకంగా చర్చించారు. ఆయా జిల్లాల్లో బయటికి రాని నేతలు ఎవరు, నియోజకవర్గానికి దూరంగా ఉన్న నేతలు ఎవరు అని ఆరా తీశారు. ఫలితాల నియోజకవర్గంలో పర్యటించని నేతలు, కంటికి కనిపించకుండా క్యాడర్‌కు దూరంగా ఉన్న నేతల విషయంలో మార్పు తప్పదన్న సంకేతాలను బలంగా పంపడంతో పాటు ఒక్కొక్కరు అజ్ఞాతాన్ని వీడుతున్నారు. పార్టీని వీడిన వారి స్థానంలో నియోజక వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వచ్చారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఎవరైతే నియోజక వర్గాలకు దూరంగా ఉన్నారని భావించారో ఆయా పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ కావాలని కోరుకున్న నేతలను ఏరుకొని జగన్మోహన్ రెడ్డి నియమించారు. దాంతో పాటు ఎవరైతే నేతలు బయటికి రాలేదో ఆ నియోజకవర్గంలో కొత్త నేతలు అవకాశం కల్పిస్తామన్న సంకేతాలను పరోక్షంగా పంపడంతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న పార్టీ సీనియర్లు అంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.మాజీ మంత్రి రోజా నుంచి అమర్నాథ్ వరకు ప్రస్తుతం నేతలంతా కూడా బయటికి రావడానికి గల కారణాలు అవే అన్న చర్చ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో జోరుగా నడుస్తోంది.

మొత్తానికి కారణాలు ఏవైనా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఒక్కొక్కరు బయటకు రావడం ఇప్పుడు వైసీపీలో జోష్ కనిపిస్తుంది. వైఫల్యాల విషయంలో మాత్రమే కాకుండా పార్టీలో రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి ఇప్పటి నుంచైనా తాజా మాజీలు అంతా కలిసి వస్తారో లేదో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..