Andhra Pradesh: ఏపీలో ‘ఇంగ్లీష్ మీడియం’పై రాజకీయ దుమారం.. పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితమంటూ మంత్రుల కౌంటర్‌..

|

Oct 22, 2023 | 8:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్‌ మీడియం చదువులపై అధికార విపక్షాల మధ్య వార్‌ జరుగుతోంది. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ అవసరమా అని జనసేన అధినేత పవన్ ప్రశ్నిస్తే..మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌లు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. బైజూస్‌తో తమకు ఏ రకమైన ఒప్పందం లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అవసరం లేదా అని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఇంతకీ...ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకింత వివాదం? ఏపీ విద్యావ్యవస్థలో అసలేం జరుగుతోంది?

Andhra Pradesh: ఏపీలో ‘ఇంగ్లీష్ మీడియం’పై రాజకీయ దుమారం.. పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితమంటూ మంత్రుల కౌంటర్‌..
Andhra Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్‌ మీడియం చదువులపై అధికార విపక్షాల మధ్య వార్‌ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో విద్యావిధానంపై తీసుకుంటున్న నిర్ణయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యం అంటూ ఇంగ్లీష్ మీడియంతో పాటు బైజూస్ కంటెంట్.. 3వ తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ లాంటి కార్యక్రమాలను జగన్‌ ప్రభుత్వం చేపడుతోంది. ఈ క్రమంలో 3వ తరగతి పిల్లలకు టోఫెల్ అవసరమా.. అమెరికా, బ్రిటిష్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే పేదరికం పోతుందా.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించడం రాజకీయాల్లో దుమారం రేపింది. ఏపీ విద్యావిధానంలో ఏదో లోపముందని ఆరోపించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. ఇంగ్లీష్ రాకపోతే ఇక బతుకే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అయితే పవన్‌కి మంత్రులు జోగి రమేష్‌, బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. పిల్లలు చదువుతుంటే ఎందుకు పవన్‌కి అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఇలాంటి ప్రతిపక్ష నాయకుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించకూడదా అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.

బైజూస్‌తో ఎలాంటి ఒప్పందమూ లేదు.. బొత్స

బైజూస్‌తో జరిగిన ఒప్పందంలో అవినీతి జరిగిందన్న పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందులో ఆర్థిక సంబంధమైన కమిట్‌మెంట్ ఏదీ లేదని ముందే చెప్పామన్నారు. వందకు వందశాతం ఉచితంగా అందించే సేవలేనంటూ పేర్కొన్నారు. అవినీతి జరిగిందన్న పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితమని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అవసరం లేదా? అని ప్రశ్నించారు. అవినీతి జరిగితే మేమే విచారణ వేసుకుంటాం..పవన్‌ చరిత్ర తెలీకుండా మాట్లాడుతున్నారంటూ బొత్స ఫైర్‌ అయ్యారు.

ఇలా ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి టోఫెల్ శిక్షణ వరకు అన్ని అంశాలపైనా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఎవరేమి అనుకున్నా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ విధానమంటోంది ప్రభుత్వం. దీంతో ‘ఇంగ్లీష్ మీడియం’ చదువుల చుట్టూ.. అటు విపక్షాలు.. ఇటు ప్రభుత్వం విమర్శలతో రాజకీయాలు మరింత హీటెక్కాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..