AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections: ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో వైరల్

ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

AP Elections: ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో వైరల్
YSRCP MLA Pinnelli Ramakrishna Reddy Damaging An EVM
Ram Naramaneni
|

Updated on: May 22, 2024 | 7:59 AM

Share

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది.  రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.  తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా వీడియో బయటకు రావడంతో.. ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు.

కాగా ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది ఈసీ.  బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్‌ 202తో పాటు మరో 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ స్టేషన్ నంబర్‌ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఏంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెబ్‌ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిపారు.

ఈవీఎం ధ్వంసం ఘటన కేసు దర్యాప్తులో భాగంగా.. పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు ఈవీఎంలు ధ్వంసమైన అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందశారు. ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు వెళ్లాయి.

మరోవైపు ఎన్నికల అనంతరం ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో 146 కేసులు ఉండగా 1500 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు అనుమానిత గ్రామాల్లో తనిఖీలు చేశారు. దొడ్లేరు, గ్రంధశిరి, తాళ్లూరులలో క్షుణ్ణంగా సోదాలు చేశారు. మొత్తానికి ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..