AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ మాస్టర్ స్ట్రాటజీ.. క్లీన్ స్వీప్‌కు పక్కాగా స్కెచ్..!

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ స్ట్రాటజీని రూపొందిస్తోంది వైసీపీ. మూడు రాజ్యసభ స్థానాలలోనూ విజయం సాధించడంతో పాటు టీడీపీకి ఎలాంటి అవకాశం లేకుండా చేయాలన్నది ప్రణాళిక. ఎన్నికల వేళ పొరపాటున టీడీపీకి ఒక స్థానం వెళ్ళినా ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది..

YS Jagan: రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ మాస్టర్ స్ట్రాటజీ.. క్లీన్ స్వీప్‌కు పక్కాగా స్కెచ్..!
Ap Ysrcp
S Haseena
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 24, 2024 | 5:16 PM

Share

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ స్ట్రాటజీని రూపొందిస్తోంది వైసీపీ. మూడు రాజ్యసభ స్థానాలలోనూ విజయం సాధించడంతో పాటు టీడీపీకి ఎలాంటి అవకాశం లేకుండా చేయాలన్నది ప్రణాళిక. ఎన్నికల వేళ పొరపాటున టీడీపీకి ఒక స్థానం వెళ్ళినా ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీకి అసలు పోటీ చేసే ఆలోచన కూడా లేకుండా చేయాలన్నదే వైఎస్సార్సీపీ ప్లాన్. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్‌, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియనుంది. ఈ 3 రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో మూడు సీట్లనూ చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార వైసీపీ. ఈ ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీ కనీసం ఆలోచించకూడదన్న ప్రణాళిక రచిస్తోంది వైసీపీ.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయగా ఇప్పుడు ఆమోదం తెలిపారు. అంతే కాదు టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మేల్యేలు, జనసేన నుంచి వైసీపీకి వచ్చిన రాపాక వరప్రసాద్, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలు నెల రోజుల సమయం అడిగినా వారం రోజుల్లోనే సమాధానం చెప్పాలని కూడా స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. మూడు రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి గెలుపొందిన మేకపాటి శేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సన్నిహితంగా ఉంటుండటంతో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది.

ఎన్నికల ప్రక్షాళనలో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించలేదు. వారిలో గుడివాడ అమర్ కు ప్రస్తుతానికి టికెట్ కేటాయించకపోయినా కచ్చితంగా పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు పాయకరావు పేట ఎమ్మెల్యే బాబు రావ్ స్వయంగా రాజ్యసభ అభ్యర్ధి కావడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీతోనే ఉంటారు. ఇక మిగిలిన 24 మందికి ఒక వేళ వేరే పార్టీలు టికెట్ ఇస్తే వైసీపీ దగ్గర 123 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి కావడంతో ఇంకో 9 మంది టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలను నయానో, భయానో దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది వైసీపీ.

టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో గంటా రాజీనామాను ఆమోదించారు. మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాంపై కనుక అనర్హత వేటు వేస్తే 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో ఉంటారు. అదే సమయంలో టీడీపీ ఒక రాజ్యసభ సీట్ దక్కించుకోవాలని అనుకున్నా మరో 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. అది అసాధ్యం. టీడీపీకి పోటీ చేసే ఆలోచనే లేకుండా చేయాలనే వైసీపీ ప్లాన్‌ ఎంతవరకూ వర్క్‌ అవుట్‌ అవుతుందో చూడాలి.