YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. మరోసారి జనంలోకి సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

మొన్నటి వరకూ మేమంతా సిద్ధం యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం జగన్.. ఇవాళ్టి నుంచి మరో ఎన్నికల యాత్రతో జనంలోకి వెళ్తున్నారు. తాడిపత్రి సభ నుంచి మరో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు జగన్..

YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. మరోసారి జనంలోకి సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Ys Jagan

Updated on: Apr 28, 2024 | 10:45 AM

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు. మార్చి 27నుంచి ఏప్రిల్ 24 వరకూ సక్సెస్‌ఫుల్‌గా మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేసిన జగన్.. ఇక 25వ తేదీన పులివెందులలో పర్యటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తర్వాత 26న మేనిఫెస్టో రూపకల్పన మీటింగ్‌కు హాజరయ్యారు. 27న తాడేపల్లి వైసీపీ కేంద్రకార్యాలయంలో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక ఇవాళ్టి నుంచి మరో ఎన్నికల ప్రచారయాత్రను ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి.. అక్కడ జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు జగన్‌. ఈ మేరకు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ విడుదల చేశారు.

దీనిలో భాగంగా ఇవాళ ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. ఇక మే1వరకూ జగన్ ఎన్నికల ప్రచార యాత్ర షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది వైసీపీ.

ఇక మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఐదేళ్ల ఏపీ విజన్‌ను ప్రకటించారు. అన్ని రంగాల్లో ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 2024ను రూపకల్పన చేసి విడుదల చేశారు. చెయ్యగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి.. అవి చేసి చూపించి మళ్లీ ఈ రోజు నుంచి ప్రజల దగ్గరికి చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నానంటూ జగన్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..