AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఢిల్లీలో షర్మిల.. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ అదేనా..?

ఏపీ కాంగ్రెస్ పునర్వైభవం కోసమా.. లేక రాజ్యసభ బెర్త్ కోసమా? ఢిల్లీ వేదికగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జరిపిన తాజా భేటీ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు కర్ణాటక సీఎం పీఠాన్ని డీకే శివకుమార్ అధిరోహించబోతున్న తరుణంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లాలని షర్మిల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

YS Sharmila: ఢిల్లీలో షర్మిల.. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ అదేనా..?
Ys Sharmila Meets Rahul Gandhi
Gopikrishna Meka
| Edited By: |

Updated on: May 29, 2026 | 5:44 PM

Share

కర్ణాటకలో నాయకత్వ మార్పు, కేబినెట్ కూర్పు ప్రక్రియకి సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సోనియా గాంధీ నివాసం 10 జన్ పథ్‌లో అరగంటకు పైగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 2024 లో వైఎస్ఆర్టీపి పార్టీని ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ సమక్షంలో విలీనం సందర్భంగా తనకు ఇచ్చిన హామీని అధిష్టానానికి గుర్తుచేశారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు చేసిన సేవలు, ఆయన కలలు, రాహుల్ గాంధీని PM చేయాలన్నదే తన లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తాననని పార్టీ విలీనం సందర్భంగా అన్నారు. అయితే YSRTP పార్టీ విలీన ప్రక్రియ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారు. డీకే శివకుమార్‌తో షర్మిలకు సన్నిహిత సంబంధాలున్నాయి.

ప్రస్తుతం జూన్ 18న దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా దక్షిణాదిలో కర్ణాటక నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కి మూడు స్థానాలు, జేడీఎస్ బీజేపీకి ఒక స్థానం దక్కబోతున్నాయి. కర్ణాటక నుంచి ఉన్న మూడు సీట్లలో మల్లికార్జున ఖర్గే, కేజే జార్జ్, షర్మిలరెడ్డితో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1 నోటిఫికేషన్ వెలువడుతుండగా జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు గడువుంది. నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని షర్మిల అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది .గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలు ప్రజలకు తెలియాలన్నా, పార్టీ బలోపేతం, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాజ్యసభలో ఏపీ గొంతుక వినిపించే అవకాశం ఉంటే అది ఎంతగానో పార్టీ పునర్వైభవానికి ఉపయోగపడుతుందని షర్మిల అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తుంది. అయితే రాజ్యసభ స్థానం గురించి మీడియా అడగ్గా దానికి షర్మిల స్పందించలేదు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి, పార్టీ బలోపేతం గురించి చర్చించి కీలక సూచనలు తీసుకున్నట్లు షర్మిల వెల్లడించారు..

ఏపీలో పార్టీ బలోపేతం కోసం కర్ణాటక నుంచి ఏపీ కాంగ్రెస్ నేతకు రాజ్యసభకు ఇవ్వాలని భావిస్తే అధిష్టానం దృష్టిలో షర్మిలతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుడు రఘువీరా రెడ్డి కూడా ఉన్నారు. రఘువీరా రెడ్డి కూడా డీకే శివకుమార్‌కి సన్నిహితుడు. కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకస్తుడు. వైఎస్‌ఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో YSRTP పార్టీ విలీనం తరువాత అడగకుండానే పిసిసి అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. అయితే గడిచిన రెండేళ్లలో ఆశించిన స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడం జరగకపోగా షర్మిల నాయకత్వంలో పార్టీ మరింత బలహీన పడుతుందన్న ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి. రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సుంకర పద్మ శ్రీ అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు షర్మిలకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

Follow Us