ఏపీలో ప్రతీ ప్రాంతానికీ నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. వర్చువల్ విధానంలో ఆయన 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవాలు చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో 10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఏపీ ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. ఇంధన రంగానికి సంబంధించి 6600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.
రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. అప్పట్లో ఇవ్వాలనుకున్నా కెపాసిటీ సరిపోదని అధికారులు వివరించినట్లు తెలిపారు సీఎం జగన్. అలాంటి పరిస్థితులను అధిగమించి 1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటుచేసి ట్రాన్స్ మిషన్ కెపాసిటీని అభివృద్ది చేసి ఈరోజు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2.49 కే సోలార్ పవర్ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. హెచ్‌పీసీఎల్‌తో 10 వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.
సోలార్, విండ్, పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ పేరుతో ప్రాజెక్ట్‌లు రాబోతున్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే 25ఏళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుల రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం వల్ల 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఇప్పటికే ఏపీలో ఉత్పత్తి ప్రారంభించిందని, లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..