Yanamala Rama Krishnudu on CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం జగన్ పాపమేనని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మొదటిసారి నిరుద్యోగుల ఆత్మహత్యా ఘటనలు చూస్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యా ఘటనలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొదటిసారి చూస్తున్నామంటూ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ఆర్థిక అసమానతలు మరింత పెంచబోతున్నారంటూ యనమల పేర్కొన్నారు. ఫైనాన్సియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జట్ మేనేజ్‌మెంట్‌లో ఏపీని అధోగతి పాలు పట్టించారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించినా.. జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవడం లేదని పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ సమర్పించిన సమగ్ర అప్పుల నివేదిక చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారని వివరించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లో 4 శాతం కన్నా అధికంగా రూ. 17,924 కోట్ల రూపాయలు అప్పులు ముందే చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీలో అప్పుల కోసం చక్కర్లు కొట్టిన కొద్ది రోజుల్లోనే.. కేంద్రం రుణ పరిమితిలో కోత పెట్టడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు.
ఎన్.కె. సింగ్ నేత్రత్వంలోని ఎఫ్.ఆర్.బి.ఎం రివ్యూ కమిటీ ఏప్రిల్ 2020 లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముందే హెచ్చరించిందని.. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కమిటీ ఫైనాన్సియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జట్ మేనేజ్ మెంట్ పై అధ్యాయనం చేసి చెప్పిందని దానిని విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్రాలు జి.ఎస్.డి.పిలో అప్పు నిష్పత్తి 20 శాతం మించితే బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌గా కేంద్రం నిర్ణయించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల నిష్పత్తి 17 శాతం కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత దారుణంగా 31.46 శాతంగా ఉందని కమిటీ చెప్పిందన్నారు. దేశంలోనే అప్పు భారం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండటం జగన్ దివాలకోరు ఆర్ధిక విధానాలకు నిదర్శనమంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో మరింత పన్నుల భారం పడనుందని ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read: