AP News: మస్కట్‌ నుంచి తిరుగుప్రయాణంలో అలా.. ఇంటికి చేరకునేలోగా ఇలా..

ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లిన ఓ మహిళ అక్కడ య‌జ‌మానుల పోరు భ‌రించ‌లేక స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కింది. కానీ, ఇంటికి చేర‌కుండానే బ‌స్సులోనే ప్రాణాలు వదిలింది. ఏపీకి చెందిన ఓ మ‌హిళ‌ హైదరాబాద్‌ నుంచి తణుకు వెళుతుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందింది.

AP News: మస్కట్‌ నుంచి తిరుగుప్రయాణంలో అలా.. ఇంటికి చేరకునేలోగా ఇలా..
Satya Padma
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 28, 2024 | 3:32 PM

కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, కుంటుంబానికి అండగా నిలవాలని, అందరినీ వదిలి అప్పలు చేసి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో ఘోరంగా మోసపోతున్నారు. వీరిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నారు. కొందరు తాము అక్కడ పడుతున్న బాధలను సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాద్వారా ఇక్కడి ప్రభుత్వాకు తెలియచేసి, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరికొందరు తమ స్వంత ప్రయత్నంతోనే స్వదేశానికి తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా గల్ఫ్‌ దేశానికి వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళ తిరిగి వస్తూ ఇంటికి చేరకుండానే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.

ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లిన ఓ మహిళ అక్కడ య‌జ‌మానుల పోరు భ‌రించ‌లేక స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కింది. కానీ, ఇంటికి చేర‌కుండానే బ‌స్సులోనే ప్రాణాలు వదిలింది. ఏపీకి చెందిన ఓ మ‌హిళ‌ హైదరాబాద్‌ నుంచి తణుకు వెళుతుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌కు తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన సత్యపద్మతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంప‌తుల‌కు ఇద్దరు పిల్లలు. అయితే, కుటుంబంలో ఆర్థిక సమస్యలు కారణంగా సత్యపద్మ భర్తకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఏదైనా పనిచేయాలని అనుకుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లాల‌ని నిర్ణయించుకుంది. దాని కోసం త‌న వ‌ద్ద ఉన్న డబ్బుతో పాటు మరికొంత అప్పు చేసి మొత్తం రూ. 2 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చింది. దాంతో ఆమెను ఏజెంట్ గల్ఫ్ దేశం మస్కట్‌ పంపించింది.

కానీ అక్కడికి వెళ్లిన స‌త్యప‌ద్మకు అనుకున్న ప‌ని దొర‌క‌లేదు. దొరికిన ప‌ని చేసుకుందామ‌నుకుంటే య‌జ‌మానుల పోరు ఎక్కువైంది. విశ్రాంతి లేకుండా ఎక్కువ ప‌ని చెప్పడంతో ఆమెకు ఆరోగ్య స‌మ‌స్యలు తలెత్తాయి. దాంతో చేసేదేమిలేక స్వదేశానికి వ‌చ్చేయాల‌ని నిర్ణయించుకుంది. ఇదే మాట అక్కడి య‌జ‌మానుల‌తో పాటు ఇక్కడి ఏజెంట్‌కు చెప్పింది. దాంతో రెండు లక్షలు ఇస్తేనే స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఏజెంట్ చెప్పింది. ఇక్కడ‌ ఉన్న భర్త ప్రభాకర్‌ ఏజెంట్‌కు ఆ రెండు లక్షలు చెల్లించాడు. అలా డబ్బులు చెల్లించిన తర్వాత సత్యపద్మ ఈ నెల 24న మస్కట్‌ నుంచి సొంతూరుకి బయల్దేరింది. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. తణుకు వెళ్లే బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం మ‌రింత‌ క్షీణించ‌డంతో బస్సులో గుండెపోటుకు గురైంది. ఛాతిలో విపరీతమైన నొప్పితో కూర్చున్న సీటులోనే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన బస్సు కండక్టర్‌.. సత్య పద్మ భ‌ర్త‌కు సమాచారం అందించారు. ఏజెంట్‌కు డబ్బు చెల్లించిన తర్వాత తన భార్య ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ప్రభాకర్ భోరున విలపించాడు. ఆమె ఆరోగ్యం బాలేదని  తెలిసి కూడా ఇలా చేయ్యడం దారుణ‌మ‌ని ప్రభాక‌ర్ కన్నీరుమున్నీరు అయ్యాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..