
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 31లోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీచ్చింది. అటు ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని కేబినెట్ సబ్ కమిటీకి అల్టిమేటమ్ ఇచ్చాయి. లేదంటే యధావిధిగా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
మంత్రుల కమిటీతో.. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మంత్రివర్గంతో చర్చల్లో పురోగతి ఉందంటూనే మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందన్నారు.
కోవిడ్ కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమని.. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంతృప్తిపడేలా చర్చలు సాగాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. పెండింగ్‌లో ఉన్న 3 వేల కోట్లు రూపాయలు చెల్లిస్తామన్నారు.
డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గబోమన్నాయి ఉద్యోగ సంఘాలుు. నెల రోజుల దశల వారి ఉద్యమంతో ప్రభుత్వం దిగి రాకుంటే.. వచ్చే నెల 5న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ అల్టిమేటం జారీచేశాయి. అయితే దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..