ప్రముఖ కొరియర్ సర్వీస్ సంస్థకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వినియోగదారుల కమిషన్ ఉత్తర్వులు షాక్ ఇచ్చాయి. వినియోగదారుడికి కొరియర్ సర్వీస్ సంస్థ చేసిన పొరపాటుకి నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కొరియర్ సర్వీస్ విధుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఉన్నత అవకాశాన్ని కోల్పోయాడు. అయితే కొరియర్ సంస్థకు విధించిన నష్టపరిహారం వల్ల ఆ విద్యార్థి భవిష్యత్తుకు బాటలు వేయలేకపోయినా మరోసారి విధులలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడతారని పలువురు భావిస్తున్నారు.
ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటుచేస్తుంది. ఓ ప్రముఖ కొరియర్ సంస్థ సేవా లోపం కారణంగా వినియోగదారుడికి రూ.50 వేలు పరిహారం, రూ. 5 వేల ఖర్చులు చెల్లించాలని కొరియర్ సంస్థకు పశ్చిమ గోదావరి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన కొప్పర్తి భాస్కర నారాయణ కుమారుడు కొప్పర్తి కృష్ణ శ్రీనివాస్ హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ లో బి.ఏ, ఎల్.ఎల్.బి ఎంట్రన్స్ ఎగ్జామ్లో 96.6 శాతం మార్కులతో పాసయ్యాడు. యూనివర్సిటీలో ప్రవేశం కోసం అప్లికేషన్ ఫీల్ చేసి నర్సాపురంలో డి.టి.డి.సి కొరియర్ ద్వారా 3 జులై 2021న హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ కి పంపించారు.
అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ 5 జూలై 2021న ముగిసింది. అయితే విద్యార్థి కొప్పర్తి కృష్ణ పంపించిన అప్లికేషన్ 6 జులై 2021న సాయంత్రం 7:35 ని.లకు కొరియర్ సంస్థ వారు నల్సార్ యూనివర్సిటీకి అందించారు. అంటే ఒకరోజు అప్లికేషన్ లేటుగా యూనివర్సిటీకి చేరుకుంది. ఇదిలా ఉంటే 93.8 శాతం నుంచి 98.6 శాతం వరకు మార్కులు సాధించిన వారిని నల్సార్ యూనివర్సిటీ లో ప్రవేశానికి అర్హులుగా ఎంపిక చేశారు. కొరియర్ సంస్థ సేవలోపం, నిర్లక్ష్యం కారణంగా 96.6 శాతంతో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉత్తీర్ణుడైన తన అప్లికేషన్ సకాలంలో యూనివర్సిటీ కి చేరని కారణంగా ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీలో ప్రవేశం అవకాశాన్ని కోల్పోయాడు విద్యార్థి కృష్ణ.
అందుకు కొరియర్ సంస్థ సేవా లోపమే కారణమని, తనకు జరిగిన నష్టానికి, మానసిక క్షోభకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే ఇరు వాదనలు విన్న కమిషన్, 3 జులై 2021 న కొరియర్ చేసిన దరఖాస్తును, 6వ తేదీన అందినట్లు కొరియర్ సంస్థ వారు ధృవీకరణను కూడా పరిగణనలోనికి తీసుకొని , సమర్పించిన పత్రాలను పరిశీలించి, కొరియర్ సంస్థ సేవా లోపం కారణంగా విద్యార్థి కృష్ణ నష్టపోయారని గుర్తించారు. అందుకు కృష్ణకు నష్ట పరిహారంగాను రూ.50 వేలు, ఖర్చులకు అదనంగా మరో రూ.5 వేలు చెల్లించాలని కొరియర్ సంస్థను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. తాము ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం వినియోగదారుడికి నాలుగు వారాల్లో నష్టపరహారం చెల్లించాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..