Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..!

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..!
Weather
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 20, 2021 | 7:31 AM

Weather updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అధికారలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని చెప్పారు అధికారులు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిస్తాయని తెలిపింది ఐఎండీ. విశాఖ జిల్లాలో పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

అటు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలా ఉండనుందని తెలిపారు.

సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. అటు, దక్షిణ కోస్తాంధ్రాలో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

Read Also…  AP MPTC ZPTC Resutls: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం.. జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. ఎంపీటీసీల్లోనూ అదే జోరు..