Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఏపీని మరో గండం వెంటాడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీ, తెలంగాణకు తుపాన్‌ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా ప్రజలు హడలిపోతున్నారు. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. మరి తుఫాన్‌పై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఎలా ఉన్నాయి..? ఏయే జిల్లాలకు ముప్పు పొంచి ఉంది...?

Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us

|

Updated on: Oct 12, 2024 | 7:15 AM

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అక్టోబరులో ఏపీకి తుఫాన్‌ల ముప్పు

ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుఫాన్‌ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్​ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్‌, హుద్‌ హుద్‌, అంపన్‌ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే తాజా తుఫాన్‌ హెచ్చరికలతో ప్రజలు అందోళన చెందుతున్నారు.

తెలంగాణలో ఈ ప్రాంతాల్లో వర్షాలు..

ఏపీతోపాటు తెలంగాణకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

అక్టోబర్ 12 నుంచి 16 వరకు భారీ వర్షాలు

మరోవైపు దేశవ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధం చిక్కుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పేషెంట్లను మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంబవిస్తుండటంతో.. చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వరద నీరు సబ్‌వేలోకి చేరింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అలర్టైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..