Sathya Sai district: సీమలో ఎన్నడూ చూడని సిత్రం.. బోరు బావి నుంచి ఉబికివస్తున్న గంగ

కరువుదీరా వానలు కోరుకున్న రాయలసీమ... గత నెలలో వర్షపు చినుకుతో పులకించిపోతోంది. వద్దన్న కొద్దీ వానలు కురిసి... అతివృష్టితో ఉక్కిరిబిక్కిరైంది సీమ జనజీవనం. పెన్నమ్మ, క్రిష్ణమ్మతో పాటు వేదావతి, చిత్రావతి లాంటి ఉపనదులు కూడా పొంగిపొర్లాయి. దీంతో అక్కడ భూగర్భ జలాలు భారీగా పెరిగాయి.

Sathya Sai district: సీమలో ఎన్నడూ చూడని సిత్రం.. బోరు బావి నుంచి ఉబికివస్తున్న గంగ
Water overflowing from a bore well
Follow us

|

Updated on: Nov 13, 2022 | 1:20 PM

కరువుకు కేరాఫ్‌గా భావించే సత్యసాయి జిల్లాలో పాతాళగంగ ఉబికి వస్తోంది. ఓడిసీ మండలం గాజుకుంటపల్లిలో ఓ బోరు బావి నుంచి భారీగా నీరు బయటకు వస్తోంది. కొంతకాలంగా ఇంకిపోయిన బోరు నుంచి ధారాళంగా నీరు రావడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీరు రాకుండా బోరుపై బండరాయి పెట్టినా.. ఆ బండరాయిని సైతం తన్నుకుంటూ గంగ ఉబికి వస్తోంది. బోరు నుంచి భారీగా వస్తున్న నీటిని చూసి రైతు షాన్‌వాజ్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

సీమలో భారీగా పెరిగిన  భూగర్భ జలాలు…

గత నెలలో కరువు సీమలో భారీ వర్షాలు కుమ్మేశాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి.  నీటి కోసం కటకటలాడే అనంతపురం జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయ్. వరుణుడి మహోగ్రరూపానికి చిత్రావతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. అలవాటు లేని ఈ భారీవర్షాలకు ఈ సీమ విలవిల్లాడింది. పలు చోట్లు కాలవలు, చెరువలకు గండ్లు పడ్డాయి.

ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 140 ఏళ్ళ రికార్డులు బద్దలు చేస్తూ ఈ ఏడాది వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. సుమారు నలభై టీఎంసీలకు పైగా నీరు భూమిలో ఇంకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా సస్యశ్యామలం నెలకొందని అన్నారు. అయితే కొన్ని చోట్ల వేరుశనగ పత్తి వంటి పంటలకు నష్టం వాటిల్లింది.

అటు శ్రీసత్యసాయి జిల్లాను రికార్డ్ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిత్రావతి నదికి వరద పోటెత్తడంతో.. బుక్కపట్నం చెరువు సముద్రాన్ని తలపించింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ధర్మవరం చెరువు ఉధృతంగా ప్రవహించింది. ఈ భారీ వర్షాలతో భూగర్భ జలాలు అసాధారణంగా పెరిగాయని.. అందుకే ఇలాంటి బోరుబావుల నుంచి నీరు ఉబుకుతుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..