
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈసీ అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు…ఇప్పటికే తుది ఓటర్ల జాబితా విడుదల చేయడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మే 13వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండటంతో ఆ దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
ప్రశాంత వాతావరంణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సమస్యాత్మక కేంద్రాలతో పాటు కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన సూచనల ఆధారంగా వెబ్ కాస్టింగ్ ను ద్వారా పోలింగ్ ను పరిశీలించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో అక్రమ నగదు,మద్యం రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అంతర్ జిల్లా,అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పగడ్బందీగా తనిఖీలు చేయాలని సూచించారు.
అటు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బ్యాలెట్ యూనిట్లను కూడా సిద్దం చేస్తున్నారు అధికారులు. అభ్యర్ధులు ఎక్కువగా ఉన్నచోట ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని వారికోసం హోం ఓటింగ్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో హోం ఓటింగ్ కు అంతంతమాత్రంగానే స్పందన రావడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతంపైనా లెక్కలు వేస్తున్నారు అధికారులు.
అర్హత ఉన్నా.. హోం ఓటింగ్‌కు ముందుకు రాని ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల్లో పలు కేటగిరీల వారికి హోం ఓటింగ్ ను అందుబాటులోకి తెచ్చింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ కు అర్హత కలిగారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2లక్షల 11వేల257 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 5లక్షల17వేల227 మంది ఉన్నారు. అయితే వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారు.
హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారు. మార్చి 16 న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి ఏఫ్రిల్ 22 వ తేదీ వరకూ అధికారుల బృందాలు అర్హులైన హోం ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి హోం ఓటింగ్ ను వినియోగించుకునేందుకు ఫారం -12D లను సేకరించారు. హోం ఓటింగ్ కు అర్హత ఉన్న వారిలో కేవలం 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ ను ఎంచుకున్నారు. ఇక మే మూడో తేదీ నుంచి హోం ఓటింగ్ ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృందాలు వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేసి హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు.
హోం ఓటింగ్ ప్రక్రియ మొత్తం మే 8వ తేదీ నాటికల్లా పూర్తవుతుందని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే ఏడు లక్షల పైబడి ఓటర్లకు హోం ఓటింగ్ అర్హత ఉన్నప్పటికీ కేవలం 28 వేల పైచిలుకు మాత్రమే ఎంచుకోవడంపై అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. అసలే ఎండలు మండిపోతుండటంతో 85 ఏళ్లు పైబడిన వృద్దులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈసారి పోలింగ్ శాతం పెంచాలని ఎన్నికల కమిషన్ భావించింది. అయితే, హోం ఓటింగ్ శాతం తగ్గడంతో పోలింగ్ కేంద్రాలకు వస్తారని అనుకుంటున్నప్పటికీ ఎండ వేడికి ఎంతమంది ఓటు వినియోగించుకుంటారని కూడా లెక్కలేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…