అమాయక ప్రజలే టార్గెట్‌గా రెచ్చిపోయిన విశాఖ కిడ్నీ రాకెట్.. కిడ్నీ రాకెట్ ముఠాతో చేతులు కలిపిన ప్రముఖ వైద్యులు.. ఒక్కో కిడ్నీ 50 లక్షలకు విక్రయం.. బాధితులకు చేరేది మాత్రం నాలుగు లక్షలు లోపే.. ఇవీ.. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన వాస్తవాలు.. ఇంతకీ.. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ డాక్టర్లు ఎవరు? ఇంకా పట్టుబడాల్సి ఉన్న వైద్యులెందరు?
కార్ డ్రైవర్‌గా పని చేసే వినయ్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పాటు టీవీ9 వరుస కథనాలతో కిడ్నీ రాకెట్ డొంక కదిలించారు విశాఖ పోలీసులు. 8 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం వేట కొనసాగిస్తున్నారు. అరెస్టైన వారిలో తిరుమల ఆస్పత్రి ఓనర్ డాక్టర్ పరమేశ్వరరావు, మరో డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ళ ఉన్నారు. నలుగురు బ్రోకర్లు అరెస్టు కాగా.. ఇద్దరు టెక్నికల్ స్టాఫ్ జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. వారిని 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని విశాఖ పోలీసులు కోర్టుకు కోరారు. విడివిడిగా, కలిసికట్టుగా విచారించి.. మరిన్ని వివరాలు రాబట్టాలని చూస్తున్నారు. అయితే.. ఈ కేసులో ప్రాథమికంగా సేకరించిన వివరాలే షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. బాధితుల నుంచి నాలుగైదు లక్షలకు కిడ్నీలు తీసుకుని.. మార్కెట్లో మాత్రం రూ. 50 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. వినయ్‌కుమార్ లాంటి బాధితులు పదుల సంఖ్యలో ఉండొచ్చని విశాఖ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక.. కిడ్నీ రాకెట్ దందా వెనుక పాత్రధారులు, వారి ప్రొఫైల్‌తో విశాఖ పోలీసులకు దిమ్మతిరుగుతోంది. మానవ అవయవాలతో గొప్పగొప్ప డాక్టర్లు చేస్తున్న బిజినెస్ షాకిస్తోంది. ముఖ్యంగా.. డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ళ ప్రొఫైల్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. ఈయన.. చెన్నైలోని ప్రఖ్యాత కావేరి హాస్పిటల్స్‌కి గ్రూప్ డైరెక్టర్. సీనియర్ కన్సల్టెంట్ కూడా. హైదరాబాద్‌లోనూ పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పట్టా పొందిన రాజశేఖర్.. దేశవిదేశాల్లోని వివిధ మెడికల్ యూనివర్శిటీలు, కాలేజ్‌ల నుంచి పీజీలు చేశారు. ప్రధానంగా సర్జరీలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో విశిష్ట అనుభవం కలిగి.. దేశంలోనే ప్రఖ్యాత వైద్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన అపాయింట్‌మెంట్‌కే ఆరు నెలల సమయం పడుతుందంటే.. ఎలాంటి డాక్టరో అర్థం చేసుకోవచ్చు. అలాంటి డాక్టర్.. కిడ్నీ రాకెట్ ముఠాతో చేతులు కలపారంటే పోలీసులే కాదు.. సమాజమూ నివ్వెరపోతోంది. అందుకే.. జీవితంలో చేసిన ఏకైక పొరపాటంటూ పోలీసుల విచారణలో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
మరోవైపు.. డాక్టర్ రాజశేఖర్‌తోపాటు మరికొంతమంది ప్రముఖ వైద్యులకు కిడ్నీ రాకెట్ దందాలో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. బండారం బయటపడటంతో డైరెక్ట్‌గా కోర్టులో లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాకినాడకు చెందిన ఓ డాక్టర్.. కోర్టులో లొంగిపోయే ప్రయత్నం చేసినట్టు సమాచారం. మీడియాలో వస్తున్న కథనాలతో నిందితులు పారిపోవడం, కోర్టులో లొంగిపోవడం, ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకోవడం లాంటివి చేయోచ్చు. అందుకే.. పోలీసు అధికారులు కూడా వివరాలు వెల్లడించడానికి సమయం తీసుకుంటున్నారు. అయితే.. మిగిలినవారిలోనూ పేరు, ప్రఖ్యాతలు గల డాక్టర్లు ఉన్నట్లే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. గొప్ప చదువులు చదివి ఈజీ మనీకి అలవాటు పడిన ప్రముఖ డాక్టర్లు.. ఇప్పుడు చేసిన తప్పుకు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..