Visakhapatnam: రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌

రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్‌ గుర్తింపును పునరుద్ధరించారు. బీచ్‌ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తుంది. ఇటీవల పలు కారణాలతో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించారు.

Visakhapatnam: రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌
Blue Flag to Rushikonda Beach

Edited By: Balaraju Goud

Updated on: Mar 27, 2025 | 4:41 PM

విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు లభించింది. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను పునరుద్ధరిస్తున్నట్టు బ్లూఫ్లాగ్‌ ఇండియా నేషనల్‌ ఆపరేటర్‌ డాక్టర్‌ శ్రీజిత్‌ కురూప్‌ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్‌ జ్యూరీ సభ్యులు అజయ్‌ సక్సేనాతో కలిసి రెండు రోజుల క్రితం బీచ్‌ను సందర్శించిన ఆయన.. రుషికొండ బీచ్‌లో సదుపాయాలను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెలలో విత్‌డ్రా చేసుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను విశాఖ కలెక్టర్‌ ప్రసాద్‌కు అందజేశారు. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్‌ నిర్వహణ లాంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని పర్యాటక శాఖ అధికారులకు బ్లూఫ్లాగ్‌ ఇండియా బృందం సూచించింది.

బీచ్‌ నిర్వహణ అధ్వాన్నంగా ఉందనే ఫిర్యాదులతో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ కొన్ని రోజుల క్రితం రద్దు చేసింది. దాంతో.. కొందరు అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు కూడా వేసింది. అధికారుల మధ్య సమన్వయం లోపంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయినట్లు అంచనాకు వచ్చింది. బీచ్‌లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వహించినట్లు గుర్తించి.. పలువురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది.

విశాఖ రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఉపసంహరణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే.. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రుషికొండ బీచ్‌ను సందర్శించి.. వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. మళ్లీ బ్లూ ఫ్లాగ్ హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే.. రుషికొండ బీచ్‌లో పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాల్లో లోపాలను అధికారులు సవరించడంతో.. రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..