Vizag: ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఎప్పుడూ అదో రకమైన వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా

ఆ హాస్టల్ నుంచి ఎప్పుడూ అదో రకమైన వాసన వస్తుంది. అదేంటో తెలియదు కానీ.. చుట్టుపక్కల చాలా హాస్టల్స్ ఉన్నా.. స్టూడెంట్స్ అక్కడే ఉండాలని ఆరాటపడుతున్నారు. వారి ప్రవర్తన కూడా తేడాగా ఉంటుంది. ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత....

Vizag: ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఎప్పుడూ అదో రకమైన వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా
Hostel
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 01, 2024 | 12:08 PM

గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం అధికారంలో వంద రోజులు యాక్షన్ ప్లాన్‌తో ముందు వెళ్తుంటే.. కొందరు మత్తుగాళ్ళ ప్రవర్తనలో ఇంకా మార్పు కనిపించడం లేదు. గంజాయిని సప్లై చేయడమే కాదు.. హాస్టల్‌కు వచ్చే వారికి గంజాయి రుచి చూపిస్తూ మత్తులో ముంచెత్తుతున్నాడు ఓ హాస్టల్ నిర్వాహకుడు. విశాఖ గాజువాకలో పోలీసుల తనిఖీల్లో ఈ హాస్టల్ గంజాయి గుట్టు బయటపడింది.

విశాఖ గాజువాక చైతన్య నగర్‌లోని జయంతి పెరల్స్ అనే అపార్ట్ మెంట్‌లో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట రాకేష్ కుమార్.. హాస్టల్ నిర్వహణ బాధ్యత చూసుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా అక్కడ గంజాయి వ్యవహారాలు గుట్టుగా సాగిపోతున్నాయి. చుట్టూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల మూమెంట్ ఉండే ఈ ప్రాంతంలో.. తన మత్తు సామ్రాజ్యానికి పదును పెట్టే ప్లాన్ చేసుకున్నాడు రాకేష్ కుమార్. ఇక చెప్పేదేముంది.. ఏజెన్సీ నుంచి గంజాయి తెప్పించి.. ఎంచక్కా సప్లై చేసేస్తున్నాడు. అడిగిన వారికి కాదనకుండా గంజాయి ప్యాకెట్ చేతిలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. వాడికి మరి కొంత మంది సహకరిస్తున్నారు. ఎంతలా అయిపోయిందంటే.. ఆ హాస్టల్లో పెయిడ్ గెస్ట్‌గా ఉంటే చాలు.. గంజాయి ఫ్రీ అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ హాస్టల్ ఎప్పుడూ అదే రకమైన వాసన వస్తుందని.. చుట్టుపక్కల వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు కూపి లాగి పక్కా సమాచారంతో..

సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు.. హాస్టల్‌కు చేరుకుని సోదాలు చేశారు. పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుడు తోట రాకేష్ కుమార్ సహా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. గంజాయి సప్లై, వినియోగంతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. రాకేష్ కుమార్ తో పాటు వెంకట సాయి కుమార్, కసిరెడ్డి రాంబాబు, రెడ్డి కిషోర్, చొక్కా జగదీష్, ఆకుల వినయ్ కుమార్, ముఖేష్‌లను కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. ఎస్ కోటకు చెందిన మరో ఇద్దరు కిలో సురేష్, కిలో రంగారావు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు.

సిఐ శ్రీనివాసరావు ఏమన్నారంటే…

‘గాజువాక చైతన్య నగర్ జయంతి పెరల్స్ అపార్ట్మెంట్లో వర్కింగ్ మెన్ హాస్టల్ రాకేష్ కుమార్ నిర్వహిస్తున్నాడు. గత ఆరు నెలలుగా హాస్టల్ నిర్వహణ జరుగుతోంది. రాకేష్ కుమార్.. కొత్తవలస పరిసర ప్రాంతాలకు చెందిన యువకులతో గంజాయిని తెప్పించి అమ్మకాలు చేస్తున్నాడు. అడిగినవారికి సప్లై చేస్తున్నాడు. 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. హాస్టల్ నిర్వాహకుడు రాకేష్ కుమార్ సహా ఏడుగురిని అరెస్టు చేశాం. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం. అనంతగిరి పరిసర ప్రాంతాల నుంచి గంజాయి రాకేష్ కుమార్ కు అందుతుంది.’ అని అన్నారు గాజువాక సీఐ శ్రీనివాసరావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..