మార్కెట్లో మండుతున్న టమాటా !
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కూరగాయాలతోపాటు టమాటా కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా 60 రూపాయాలు పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కూరగాయాలతో పాటు టమాటా కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది. కేవలం పదంటే పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటా 30 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే అక్టోబర్ నెలాఖరు వరకు సామాన్యులు టామాటా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా 56 రూపాయల వరకు పలుకుతోంది. అన్‌సీజన్‌లో అత్యధిక ధర నమోదైంది. గత నాలుగేళ్లుగా అన్‌సీజన్‌లో ఇదే అత్యధిక ధరని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. బయట మార్కెట్లలో పెద్దగా టమాటా కన్పించకపోవడంతో అంతా మదనపల్లి మార్కెట్‌కే వస్తున్నారు. రోజు దాదాపుగా 350 మెట్రిక్ టన్నులకు పైగా టమాటా మదనపల్లి మార్కెట్‌కు వస్తోంది. అన్‌సీజన్‌లోనూ టమాటాకు మంచి ధర పలకడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు.
ఇటు తెలంగాణలోనూ టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 30 మేర ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 50–60 పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుంది. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 15 నుంచి 20 శాతం వరకే ఉంటుంది. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో టమాటా సాగవుతుంది.
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్ మేర సరఫరా లేక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మదనపల్లితోపాటు కర్ణాటకలోని చిక్‌మంగళూరు, కోలారు, చింతమణి ప్రాంతాలు, మహారాష్ట్రలోని బీదర్, షోలాపూర్, నాందేడ్ నుంచి కొంతమేర టమాటా రాష్ట్రానికి వస్తోంది. లాక్‌డౌన్ అనంతరం జూన్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరగడం వల్ల టామాటా ధర రూ. 50 వరకు పెరిగింది.
గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్ చివర, నవంబర్‌లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులకు ఈ ధరలు మరింత షాకిచ్చాయి.