AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయానికి ఓపికే ఆయుధం.. జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఏనుగు కథ!

మన జీవితంలో విజయం సాధించడానికి ప్రతిభ, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో.. ఓపిక, సహనం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా వెంటనే ఫలితం రాకపోవచ్చు. అలాంటి సమయంలో చాలామంది ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తారు. కానీ విజయానికి చేరువయ్యేది మాత్రం చివరి వరకు ఓపికగా ప్రయత్నించే వ్యక్తే..

విజయానికి ఓపికే ఆయుధం.. జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఏనుగు కథ!
The Power Of Patience In Achieving Success
Srilakshmi C
|

Updated on: Sep 14, 2026 | 11:18 AM

Share

ఒకసారి రవి అనే వ్యక్తి బైక్‌పై ఆఫీసుకు బయలుదేరాడు. దారిలో ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వచ్చింది. రెడ్‌ లైట్‌ ఉండటంతో ఆగాడు. గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే బయలుదేరాడు. కొంతదూరం వెళ్లగానే మరో సిగ్నల్‌ వచ్చింది. అక్కడ కూడా ఆగి.. గ్రీన్‌ లైట్‌ కోసం ఎదురుచూశాడు. మరికొంత దూరం వెళ్లగానే మూడో సిగ్నల్‌ వచ్చింది. అప్పటికే ఆఫీసుకు ఆలస్యం అవుతోంది. ఈసారి రవికి ఓపిక లేకపోయింది. ‘ఇక్కడ ఏ వెహికల్స్‌ లేవు కదా.. వెళ్లిపోదాం’ అనుకుని గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూడకుండా ముందుకు వెళ్లాడు. అంతలోనే వేగంగా వచ్చిన ఓ లారీ అతని బైక్‌ను ఢీకొట్టింది. ఒక్క క్షణం ఓపిక పట్టి ఉంటే రవి ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు. ఈ చిన్న సంఘటన మనకు ఒక పెద్ద పాఠాన్ని చెబుతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒక్క క్షణం ఓపిక కూడా మన జీవితాన్ని మార్చగలదు.

డిఫికల్ట్‌ అంటే ఏంటి?

టెన్నిస్‌ దిగ్గజం జిమ్‌ కొరియర్‌ చెప్పిన ఓ మాటను గుర్తు చేసుకోవాలి. ఒక పని సులభంగా అనిపిస్తే వెంటనే చేయొచ్చు. కానీ అదే పని కష్టంగా అనిపిస్తే.. దానికి సమయం పడుతుందని అర్థం. అలాంటప్పుడు తొందరపడకుండా ఓపికతో ప్రయత్నించాలి. మన జీవితంలో కూడా ఇదే నిజం. త్వరగా సులభంగా దొరికిన వాటికి మనం పెద్దగా విలువ ఇవ్వం. అదే ఒక వస్తువును లేదా విజయాన్ని సాధించడానికి ఎన్నో రోజులు కష్టపడితే.. దాని విలువ మన దృష్టిలో ఎన్నో రెట్లు పెరుగుతుంది.

తాజ్‌మహల్‌ మనకు చెప్పే పాఠం

ఆగ్రాలోని తాజ్‌మహల్‌ గురించి ఆలోచించండి. దాన్ని నిర్మించడానికి సంవత్సరాల సమయం, వేలాది మంది కార్మికుల శ్రమ అవసరమైంది. ఒక్క రోజులో లేదా కొన్ని నెలల్లో అది నిర్మించలేదు. ఒక్కో రాయి పేర్చి.. ఒక్కో పనిని పూర్తి చేస్తూ.. ఎంతో కాలం శ్రమించిన తర్వాతే ఆ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంది. అందుకే దానికి అంతటి విలువ వచ్చింది. అదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. సమయం తీసుకుని సాధించిన విజయం ఎక్కువకాలం నిలుస్తుంది. మన ఇంట్లో రెండు నిమిషాల్లో మ్యాగీ తయారు చేసుకోవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే తినేయవచ్చు. కానీ ఇంటికి అతిథులు వస్తే కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీనే వడ్డించం. సమయం ఎక్కువ పట్టినా.. అన్నం, పప్పు, కూరలు, ఇతర వంటకాలు సిద్ధం చేస్తాం. ఎందుకంటే సమయం, శ్రమ పెట్టి తయారు చేసిన దానికి మనం ఎక్కువ విలువ ఇస్తాం.

ఇవి కూడా చదవండి

ప్రకృతి చెప్పే పాఠం – ఓపిక

తోటమాలి ప్రతిరోజూ మొక్కలకు నీళ్లు పోస్తాడు. కానీ ఒకటి రెండు రోజులు ఎక్కువ నీళ్లు పోసినంత మాత్రాన మరుసటి రోజే పువ్వులు, పండ్లు రావు. మొక్కకు పూయాల్సిన సమయం ఉంటుంది. కాయ కాయాల్సిన సమయం ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రతి విజయానికి ఒక సమయం ఉంటుంది. కష్టపడటం మన చేతుల్లో ఉంటుంది. కానీ ఫలితం రావడానికి అవసరమైన సమయాన్ని మనం గౌరవించాలి. వజ్రం కూడా ఒక్కరోజులో తయారవదు. ప్రకృతిలో వజ్రం ఏర్పడే ప్రక్రియ కూడా మనకు ఓపిక విలువను గుర్తు చేస్తుంది. భూమి లోపల అపారమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి, కాలం కలిసి వజ్రాలు తయారవుతాయి. అంటే అత్యంత విలువైన వస్తువులు కూడా ఒత్తిడి, సమయం, మార్పు వంటి ప్రక్రియల తర్వాతే రూపుదిద్దుకుంటాయి. మనిషి జీవితం కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వదిలేయకుండా.. వాటిని తట్టుకుని ముందుకు సాగితేనే మనలోని అసలైన సామర్థ్యం బయటపడుతుంది. బిడ్డ పుట్టడానికి కూడా సమయం కావాలి. గర్భంలో శిశువు ఎదగడానికి ప్రకృతి నిర్దేశించిన సమయం ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డను చూడాలనే ఆత్రుత ఎంత ఉన్నా.. ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇదే విషయాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. మనకు విజయం కావాలని ఎంత తొందరగా ఉన్నా.. దానికి అవసరమైన సమయం, కష్టం, అనుభవం పూర్తయ్యే వరకు ఓపికగా ఉండాలి.

ఒకే చోట తవ్వితేనే నీళ్లు

ఒక వ్యక్తి నీళ్ల కోసం భూమిని తవ్వడం ప్రారంభించాడు. కొంత లోతు తవ్వినా నీళ్లు కనిపించలేదు. వెంటనే మరో చోటికి వెళ్లాడు. అక్కడ కూడా కొంత తవ్వి నీళ్లు రాకపోవడంతో మూడో చోటుకు వెళ్లాడు. ఇలా పదేపదే ప్రదేశాలు మార్చుకుంటూ పోయాడు. చివరికి ఎక్కడా నీళ్లు దొరకలేదు. అతను ఒకే చోట ఓపికగా, అవసరమైనంత లోతు వరకు తవ్వి ఉంటే.. ఫలితం దొరికే అవకాశం ఉండేది. మనలో చాలామంది కూడా ఇలాగే చేస్తుంటాం. ఒక పని మొదలుపెట్టి కొంతకాలం ఫలితం రాకపోతే మరో పని మొదలుపెడతాం. అక్కడా ఫలితం రాకపోతే ఇంకొకటి మొదలుపెడతాం. చివరికి పని మారుతూనే ఉంటుంది.. కానీ విజయం మాత్రం దూరంగానే ఉంటుంది.

ఏనుగు కథ.. గొప్ప సందేశం

ఒక అడవిలో ఏనుగు, కుక్క మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి గర్భం దాల్చాయి. కొన్ని నెలల తర్వాత కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత మళ్లీ పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా కుక్క తన పిల్లల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని ఏనుగుతో పోల్చుకోవడం మొదలుపెట్టింది. ‘మనం ఒకేసారి గర్భం దాల్చాం. నాకు ఇన్ని పిల్లలు పుట్టారు. నీకు మాత్రం ఇంకా బిడ్డ ఎందుకు పుట్టలేదు?’ అని ఏనుగును ప్రశ్నించింది. అప్పుడు ఏనుగు నవ్వుతూ ఇలా చెప్పింది ‘నువ్వు కుక్క పిల్లలకు జన్మనిస్తున్నావు. నేను మాత్రం ఏనుగు పిల్లకు జన్మనివ్వబోతున్నాను. నీ పిల్లలు త్వరగా పుడతారు. కానీ నా బిడ్డకు ఎక్కువ సమయం పడుతుంది. అది పుట్టినప్పుడు చిన్నగా ఉన్నా.. పుట్టిన వెంటనే నడవగలదు. అందుకే నా ప్రయాణం నెమ్మదిగా ఉంటుంది.’ ఈ కథలోని సందేశం చాలా గొప్పది. ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవద్దు. ఎవరో త్వరగా విజయం సాధించారని మనం కూడా అదే వేగంతో విజయం సాధించాలనే అవసరం లేదు. మన ప్రయాణం వేరు. మన లక్ష్యం వేరు. మన సమయం వేరు.

కర్నల్‌ శాండర్స్‌ కథ

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన KFC వెనుక ఉన్న కర్నల్‌ హార్లాండ్‌ శాండర్స్‌ కథ కూడా ఓపికకు గొప్ప ఉదాహరణగా చెప్పబడుతుంది. తన ప్రత్యేకమైన చికెన్‌ రెసిపీని తీసుకుని ఆయన ఎన్నో రెస్టారెంట్లను సంప్రదించారు. ప్రారంభంలో చాలామంది ఆయన ప్రతిపాదనను తిరస్కరించారు. ఒకటి కాదు.. ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయి. అయినా ఆయన ఆగలేదు. తన రెసిపీపై నమ్మకం కోల్పోలేదు. చివరకు ఆయనకు అవకాశం లభించింది. ఆ ప్రయత్నమే తర్వాత KFCగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఆయన జీవితంలోని మరో విషయం మనకు ప్రేరణ ఇస్తుంది. చాలామంది ఒక వయసు వచ్చాక కొత్త పనులు చేయడం మానేస్తారు. కానీ శాండర్స్‌ మాత్రం జీవితంలో ఆలస్యంగా వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నారు. అంటే విజయానికి వయసు అడ్డంకి కాదు. పరిస్థితులు అడ్డంకి కాదు. మన ప్రయత్నాన్ని మనమే ఆపేసుకోవడమే అసలైన అడ్డంకి.

మనం నేర్చుకోవాల్సిన పాఠం.. ఇదే

మన జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే మూడు విషయాలు చాలా అవసరం. కష్టపడాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా.. ఓపికగా ఎదురుచూడాలి. వెంటనే ఫలితం రాలేదని ప్రయత్నాన్ని ఆపేయకండి. మీరు నాటిన విత్తనం మరుసటి రోజే చెట్టుగా మారదు. కానీ ప్రతిరోజూ దానికి నీళ్లు పోస్తూ, సంరక్షిస్తూ ఉంటే.. ఒకరోజు అది పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అలాగే మీ కష్టం కూడా ఒకరోజు ఫలిస్తుంది. కాబట్టి ఇతరుల వేగంతో మీ జీవితాన్ని పోల్చుకోకండి. మీ ప్రయాణంపై నమ్మకం ఉంచండి. ఓపికగా ముందుకు సాగండి. ఎందుకంటే.. ఓపికగా ఎదురుచూసేవారికే గొప్ప విజయాలు దక్కుతాయి. మీ లక్ష్యం ఎంత పెద్దదైతే.. దానికి పట్టే సమయం కూడా అంతే ఎక్కువ కావచ్చు. ఆగిపోవద్దు.. తొందరపడొద్దు.. ఓపికగా ప్రయత్నిస్తూనే ఉండండి. విజయం తప్పకుండా ఒకనాడు మీ తలుపు తడుతుంది..!

Follow Us