AP PGECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. మరో రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు షురూ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మాడి (PB) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీపీజీఈసెట్ (APPGECET), గేట్ (GATE), జీప్యాట్ (GPAT) అర్హత కలిగిన అభ్యర్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి..

అమరావతి, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మాడి (PB) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీపీజీఈసెట్ (APPGECET), గేట్ (GATE), జీప్యాట్ (GPAT) అర్హత కలిగిన అభ్యర్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తదితర ప్రక్రియలు కొనసాగుతాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు
- ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు
- వెబ్ ఆప్షన్ల సవరణ: సెప్టెంబర్ 25
- సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటల తర్వాత
- సెల్ఫ్ జాయినింగ్, కళాశాలల్లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు
- తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 30
పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో నేరుగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరై సర్టిఫికెట్లను పరిశీలించుకోవాలి. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (బెంజ్ సర్కిల్ సమీపంలో) హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఈ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఓసీ/బీసీ అభ్యర్ధులు రూ.1250, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.650 చొప్పున చెల్లించాలి. APPGECET, GATE, GPAT అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. సీట్ల కేటాయింపు అనంతరం నిర్ణీత గడువులో సెల్ఫ్ జాయినింగ్ పూర్తి చేసి సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
