Covid : షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఆళ్ల నాని.. వైద్యం, పౌష్టికాహారం అందిస్తామన్న విజయసాయి
Sheelanagar : విశాఖపట్నం షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇవాళ ప్రారంభించారు...
Sheelanagar : విశాఖపట్నం షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇవాళ ప్రారంభించారు. 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అభినందించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని.. ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రతి బెడ్‌కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కొవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి షీలా నగర్లో ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ఈ కొవిడ్ సెంటర్లో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కొవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్‌లో పేషెంట్ల అటెండెన్స్ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్‌లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. 300 పడకలున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో పూర్తి వైద్యం ఉచితంగా లభిస్తుంది. pic.twitter.com/I4Lb70N6iv
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 14, 2021