తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ భర్తీ మొదలైంది. అంగన్వాడీలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది శుభవార్త. తెలంగాణలో వేర్వేరు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా, శిశు సంక్షేమ శాఖ.
రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆమన్‌గల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏఏ అంగన్వాడీ సెంటర్‌లో ఎన్ని ఖాళీ పోస్టులున్నాయో తెలుసుకునేందుకు, నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్‌సైట్ చూడొచ్చు. స్థానికంగా నివసించేవారు మాత్రమే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లై చేసేముందు అభ్యర్థులు నివసించే ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌లో ఖాళీలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 18 చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు.