దశాబ్దాల మాటల మూటలు ఆచరణలోకి వచ్చేనా ?
దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా పొందలేక పోతున్నారు. ప్రస్తుతం సమాజంలో బాలికలు, బాల్య వివాహం, విద్య అసమానత, లింగ ఆధారిత హింస, కుటుంబ సభ్యుల ప్రవర్తన , ఆత్మగౌరవం, ఋతుస్రావం సమయంలో, ప్రార్థనా స్థలాలలో, బహిరంగ ప్రదేశాల్లో, […]
దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా పొందలేక పోతున్నారు. ప్రస్తుతం సమాజంలో బాలికలు, బాల్య వివాహం, విద్య అసమానత, లింగ ఆధారిత హింస, కుటుంబ సభ్యుల ప్రవర్తన , ఆత్మగౌరవం, ఋతుస్రావం సమయంలో, ప్రార్థనా స్థలాలలో, బహిరంగ ప్రదేశాల్లో, పని చేస్తున్న ప్రదేశాలలో లైంగిక వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఐక్యరాజ్య సమితి బాలికల హక్కులు, సమానత్వం సమస్యల పరిష్కారం దిశగా ఈ తీర్మానాన్ని తీసుకు రావడం జరిగింది. 2012 అక్టోబర్ 11నుండి ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. బాలికల స్వేచ్ఛ, హక్కుల విధ్వంసాన్ని మనం గమనిస్తూ ఉంటాము.
కుల మత, వర్గ, లింగ, ప్రాంత, భాష, వంటి అన్నీ అంశాలలో బాలికల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దురదృష్టవశాత్తూ ఈ అంశాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని అన్ని వివక్షాలకు దూరంగా మానవ హక్కుల సంస్కృతిని అభివృద్ధి చేయవలసి ఉన్నది. మానవ సమాజంలో ఒక నూతన సంస్కృతి ఆవిష్కరణకు విద్యార్థి దశ నుండే పునాదులు వేయాలి. అందువలన పాఠశాలల్లో బాల బాలికల హక్కుల గురించి నేర్పాలి.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం ముందు అంతా సమానం. ఆర్టికల్ 15 ప్రకారం మత, జాతి, కుల, లింగ, పుట్టిన ప్రదేశాన్ని బట్టి, వివక్ష చూపడం నిషేధం, జీవించే హక్కును, స్వేచ్ఛను ఆర్టికల్ 21 హామీ ఇస్తుంది. ఆహారం పొందే హక్కు, ఆశ్రయం పొందే హక్కు, మనకు రాజ్యాంగం కల్పించింది. ఆడ పిల్లలు వారి జీవితాలలో హక్కులను కోల్పోతున్నారు. ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇలా జరగడం వలన చిన్నతనంలోనే పిల్లల్ని కనడం ఇబ్బంది, ప్రసవ సమయంలో తల్లీబిడ్డా చనిపోవడం జరుగుతున్నది లేదా పుట్టే పిల్లలు పోషక ఆహారం లోపంతో పుడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల వలన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాలికలలో అవగాహన వచ్చింది. ఈ రోజు ఎక్కువ మంది బాలికలు పాఠశాలకు హాజరవుతున్నారు, తక్కువ మంది చిన్నతనంలో పెళ్లి చేసుకుంటున్నారు.
విద్య, ఉద్యోగానికి, ప్రాధాన్యత ఇస్తూ స్వేచ్ఛను పొందుతున్నారు. కొంత వరకు బాలికలలో వాళ్ల హక్కుల గురించి తెలుసుకుంటున్నారు. సమానత్వాన్ని సాధిస్తున్నారు. గత 70 ఏళ్ళుగా మాటలకే పరిమితమైన ఎన్నో హామీలు ఇపుడు కార్యాచరణ దిశగా మళ్లాలి. స్వాతంత్ర్య దినోత్సవం మొదలుకొని ప్రతీ ప్రత్యేక సందర్భాలలో అధినేతలు గుప్పిస్తున్న హామీలు వందశాతం ఆచరణలో అమల్లోకి వస్తే పరిస్థితి మారుతుంది. బంగారు భారతావని కల సాకారమవుతుంది.