రోడ్డెక్కిన సింగరేణి భూ నిర్వాసితులు…ఆత్మహత్యలే శరణ్యమంటూ ..

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. ఇళ్లు, పొలాలు పొగొట్టుకున్న బాధితులు ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. యాజమాన్యం నేటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ధర్నాకు దిగారు. ఇక ఆత్మహత్యలే శరణ్యమంటూ..

రోడ్డెక్కిన సింగరేణి భూ నిర్వాసితులు...ఆత్మహత్యలే శరణ్యమంటూ ..

Updated on: Oct 11, 2020 | 3:16 PM

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. ఇళ్లు, పొలాలు పొగొట్టుకున్న బాధితులు ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. ఇంటికో సింగరేణి ఉద్యోగం ఇస్తామంటూ అప్పట్లో కొంపా గూడు ఖాళీ చేయించిన యాజమాన్యం నేటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ధర్నాకు దిగారు..సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం యాజమాన్యం బేఖాతరు చేయడంతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. ఉద్యోగాల అయిన ఇవ్వండి, లేదా చనిపోవడానికి అనుమతులు ఇవ్వండి అని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ట్విట్టర్. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా సింగరేణి జెకే 5 ఓసి విస్తరణలో సుమారు 14 వందల కుటుంబాలు తమ నివాస గృహాలను కోల్పోయారు. వీరిలో 104 కుటుంబాలు గిరిజనులకు సంబంధించినవి ఉన్నాయి. 2008 సంవత్సరంలో జెకె 5 విస్తరణ జరిగితే జెకె ఏరియా సమీపంలో ఉన్నటువంటి 14 వందల కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందజేసింది. వారికి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసింది. ఆ కాలనీలో రోడ్డు సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు అన్నీ సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది.

అయితే, సింగరేణి భూ నిర్వాసితుల లో 104 గిరిజన కుటుంబాలుండగా,..ఈ కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని సింగరేణి యాజమాన్యం నెరవేర్చలేదు. ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. యువకులు తమకు ఉద్యోగాలు కల్పించాలని గత 12 సంవత్సరాలుగా సింగరేణి కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయారు. గత్యంతరంలేని పరిస్థితులలో హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు వీరికి అనుకూలమైన తీర్పునిచ్చింది. జీవో 34 అమలు చేస్తూ నిర్వాసిత గిరిజన యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును యాజమాన్యం బేఖాతర్ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యజమాన్యం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా గిరిజన యువకులకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అయినా సింగరేణి యాజమాన్యం నిర్వాసిత యువకులకు ఉద్యోగ కల్పనలో మొండి వైఖరిని ప్రదర్శించింది.

కోర్టు తీర్పు ప్రకారం జీవో 34 అమలు చేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు బాధిత గిరిజన యువకులు. ఆమరణ నిరాహార దీక్ష తోపాటు ఇల్లందు పట్టణ బందుకు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో కానీ, సింగరేణి యాజమాన్యంలో కానీ ఎలాంటి స్పందన కనపడక పోవటంతో యువకులలో నిరాశ అలుముకుంది. సింగరేణి అన్ని ప్రాంతాలలో నిర్వాసిత యువకులకు ఉద్యోగ నియామకాలు జరిపింది కానీ ఒక్క ఇల్లందులో మాత్రమే నియామకాలు జరపడం లేదని యువకులు ఆరోపిస్తున్నారు.

ఇక తమకు ఉద్యోగా అవకాశం సింగరేణి యాజమాన్యం కల్పించలేదని భావించిన భూ నిర్వాసిత కుటుంబాల యువకులు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే తమకు ఉద్యోగాలు అన్న ఇవ్వాలని, లేదా తాము చనిపోవడానికి అనుమతులు అన్న కల్పించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వాలు స్పందించి నిర్వాసిత యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు సైతం కోరుతున్నారు.