కుంటాల జలపాతానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ
ఆదిలాబాద్ జిల్లాలో సినీ హీరో అల్లుఅర్జున్ సందడి చేశారు. కుటుంబ సభ్యులు, పుష్ప చిత్ర బృందంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో సినీ హీరో అల్లుఅర్జున్ సందడి చేశారు. కుటుంబ సభ్యులు, పుష్ప చిత్ర బృందంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారులోని హరితవనాన్ని సందర్శించారు. పుష్ప చిత్రానికి గాను కుంటాల జలపాతం వద్ద షూటింగ్ అనువైన ప్రదేశాలను గుర్తించినట్టు పుష్పటీం సభ్యులు తెలిపారు.
కుంటాల జలపాతం జాలువారే అందాలను అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. అంతకు ముందు స్మృతివనంలో ఎర్రచందనం మొక్కను నాటారు.
ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి.
తమ అభిమాన హీరో అల్లు అర్జున్ టూర్ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కుంటాల జలపాతానికి క్యూ కట్టారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, స్థానికులతో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు.