
ఏపీలో ఇక వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన ఉండబోతుందంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. బీజేపీ-జనసేన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన రెండు పార్టీలు సంయుక్తంగా లాంగ్ మార్చ్ చేసేందుకు నిర్ణయానికి వచ్చాయి. అయితే, ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ లాంగ్‌మార్చ్ అంశం ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని.. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు.
కాగా, ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 2 .00 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు భారీ కవాతు నిర్వహించేందుకు ఇరు పార్టీలు ప్లాన్ వేశాయి. కానీ ఆరంభంలోనే ఇరు పార్టీలు తీసుకున్న ఈ నిర్ణయం వాయిదా పడటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇటీవల బీజేపీ – జనసేన నేతలు కేంద్రమంత్రులతో పాటుగా.. పార్టీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో పనిచెయ్యాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తీసుకున్న తొలి నిర్ణయమే వాయిదా పడింది. దీనిపై ఇంకా జనసేన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అసలు లాంగ మార్చ్ వాయిదా పడటానికి కారణాలేంటి.. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై బీజేపీ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో.. అసలు మళ్లీ ఈ మార్చ్ నిర్వహిస్తారా లేక విరమించుకుంటున్నారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.