విశాఖ రాజధానిగా త్వరలో ఏపీలో పాలన ప్రారంభం చేస్తామని చెబుతున్న జగన్ సర్కార్ ఈరోజు ఆదిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ హోదా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీ జీ ర్యాంక్ కు పెంచినట్టు విశాఖ సీపీ గా అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నియమించింది.
పరిపాలనా రాజధానిగా విశాఖ ను చేస్తామని తరచూ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు కానీ, లేదంటే అక్టోబర్ 24 వ తేదీ న దసరా సందర్భంగా కానీ ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖ మారుస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ వర్గాలు కూడా అవి నిజమెననట్టు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు జరిగిన తొమ్మిది మంది ఐపీఎస్ బదిలీల్లో విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న త్రివిక్రమ్ ను బదిలీ చేస్తూ కొత్త నగర పోలీస్ కమిషనర్ గా 1994 బ్యాచ్ కు చెందిన రవిశంకర్ అయ్యన్నార్ ని నియమించారు. 1983 నుంచి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి ఐజి స్థాయి అధికారి పరిరక్షణ లో ఉండేది. తాజాగా ఈరోజు ఇచ్చిన బదిలీల్లో సీనియర్ అడిషనల్ డీజీపీ ర్యాంకు కలిగి, మరికొద్ది నెలల్లో డీజీగా పదోన్నతి పొందనున్న రవిశంకర్ ఐ ఎన్ ఆర్ ని ప్రభుత్వం నియమించడం ద్వారా త్వరలోనే విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని అదనపు డీజీ హోదాకి పెంచుతున్నట్టు సంకేతాలు ఇచ్చింది. దీనితో రాజధాని తరలించే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం అదిశగా ఈ చర్య తీసుకుందన్న చర్చ ప్రారంభమైంది.
విశాఖ లో 1861 జనవరి 28 వ తేదీన వైజాగపట్టణం జిల్లా పోలీస్ వ్యవస్థ ప్రారంభమైంది. తొలుత వైజాగపట్నం కి ఎస్పీ మాత్రమే ఉండే వాళ్ళు. ఇది మద్రాస్ రాష్ట్రం లో నార్త్ రేంజ్ లో ఒక జిల్లాగా ఉండేది. ఆ తర్వాత నార్త్ రేంజ్ లోని నాలుగు జిల్లాలు వైజాగపట్నం, గంజాం ఉభయగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, కృష్ణ గుంటూరుకు చెందిన కొన్ని ప్రాంతాలు కలిపి నార్త్ జోన్ గా, దానికి ఒక డిఐజి స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండేది. 1983 వరకు ఇలానే కొనసాగింది.
స్వాతంత్రం వచ్చాక 1948 లో విశాఖలో విశాఖ నాథ్ విశాఖ సౌత్ అని రెండు భాగాలుగా విభజించినా ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయం కిందకి ఆ రెంటినీ చేర్చారు. 1983లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసి విశాఖ అర్బన్ పరిధిని అందులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యాక ఆ మొత్తం ప్రాంతాన్ని విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లాల పునర్విభజన వరకు విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి చాలా విస్తృతంగా ఉండేది. ఈ మధ్య జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖపట్నం జిల్లా మాత్రమే విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. దీనికి ఇప్పటివరకు ఒక ఐజి స్థాయి అధికారి పర్యవేక్షించేవారు. తాజాగా 20 లక్షల పైగా జనాభా కలిగిన విశాఖ అర్బన్ పోలీస్ కమిషనరేట్ పరిధిని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు తాజాగా సీనియర్ అడిషనల్ డీజీ అయిన రవిశంకర్ అయ్యన్నార్ ను నగర పోలీస్ కమిషనర్ గా తాజాగా నియమించింది. అయ్యన్నార్ 1994 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి. మరొక ఆరు నెలల్లో ఆయన డీజీగా పదోన్నతి పొందనున్నారు.
ఇప్పటివరకు ఇక్కడ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన త్రివిక్రమ వర్మ కేవలం ఐదు నెలలు మాత్రమే విశాఖలో బాధ్యతలు నిర్వహించగలిగారు. మొదటి నుంచి తీవ్రమైన ఒత్తిడి లోనే త్రివిక్రమ్ పదవి కాలం నడిచింది. వచ్చిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన సింహాచలం చందనోత్సవ నిర్వహణ వైఫల్యం చెందడం, ఆ తర్వాత విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్, అది దేశంలోనే సంచలన సృష్టించడం వాటితో పాటు ఇటీవల విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బెంగాలీ విద్యార్థిని రీతి సహా కేసులో తమకు న్యాయం జరగలేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ కోరడం, కోల్ కత్తా లో దానిపై హత్య కేసు నమోదు చేసి విశాఖలో కోల్కతా పోలీసులు విచారణ నిర్వహించడం లాంటి అంశాలను డీజీపీ కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. దానికి తోడు విశాఖలో తరచూ రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యమంత్రి త్వరలోనే వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటే సమర్థవంతమైన మరొక అధికారిని నియమించాలని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని కూడా పెంచితే బాగుంటుందన్న ఉద్దేశంతో రవిశంకర్ నియమించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి