Visakhapatnam: జరిగింది ఇదీ.. పసివాడి మృతదేహం తరలింపు ఘటనపై కింగ్ జార్జ్ ఆసుపత్రి వివరణ..
విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం కెజిహెచ్ లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ సమకూర్చకపోవడంతో..

విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం కెజిహెచ్ లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ సమకూర్చకపోవడంతో ఆ బిడ్డ తల్లితండ్రులు స్కూటీపై 120 కి.మీ. మేర మృతదేహాన్ని తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాడేరు ప్రాంతం ముంచింగుపుట్టు మాండ్లమ్ కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు.. తమ బిడ్డ మృతదేహాన్ని గురువారం ఉదయం తీసుకెళుతూ కనిపించారు. దీనిపై పలు పార్టీల నాయకులు సైతం స్పందించి.. ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ తరుణంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ ఘటనపై స్పందించారు. వైజాగ్ KGH నుంచి శిశువు మృతదేహాన్ని స్కూటర్ పై తీసుకెళ్లిన ఘటనపై వాస్తవాలను కింగ్ జార్జి ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది.
‘‘KGHలో మరణించిన శిశువు మృతదేహానికి అంబులెన్స్ సమకూర్చలేదన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం.. సదరు ఘటనపై వాస్తవాలు.. KGH నందు ఎవరైనా మరణించిన తర్వాత.. మరణాంతరం అప్పగింత ప్రక్రియ సుమారు అర్ధగంట సమయం పట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఉదయం గం.7.50 నిలకు శిశువు చనిపోతే గం.8.30 ని.లకు అప్పగింత కార్యక్రమం ముగిసింది. వెంటనే గం.8.40 ని. లకు KGH నందు గల ట్రైబల్ సెల్ వారికి కాల్ చేయడం జరిగింది. తదుపరి గం.9.15ని.లకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల గం. 8.57 ని.లకు తల్లిదండ్రులు వినకుండా శిశువు మృతదేహంతో KGH నుండి బయలుదేరినట్లు ఆసుపత్రి పేర్కొంది.
అయినప్పటికీ PO, ITDA, DM&HO పాడేరు వారికి విషయం తెలియపరిచి, వైద్య సిబ్బందితో వారి ఆచూకి కనుక్కొని, వారిని పాడేరు దగ్గర నుంచి వారి స్వగ్రామం అయిన కుమడ గ్రామానికి తరలించినట్లు పేర్కొంది. ఈ సంఘటన పూర్తిగా దురదృష్టకరం. ఇందులో ఆసుపత్రి తరుపు నుంచి ఏ లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ దురదృష్టం ఏమిటంటే వారికి అవగాహన లేకపోవటం వలన అంబులెన్స్ వచ్చే 15 ని. లకు ముందే తీసుకెళ్లినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని కింగ్ జార్జి ఆసుపత్రి తెలిపింది. ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నామని విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి పేర్కొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
