Vizag LG Polymers Plant Gas Leak: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు ఏడాది పూర్తయింది. గత ఏడాది విశాఖలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకై 15 మంది మృతి విషయం తెలిసిందే. విషవాయువు ధాటికి ఊపిరి అందక జనాలు రోడ్లపైనే కుప్పకూలిపోయారు. కళ్లెదుటే తమ వారిని కోల్పోయిన బంధువులు.. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, స్థానికులు, బాధితులలో భయం ఇంకా కనిపిస్తూనే ఉంది. అడవివరం, వేపగుంట, పెందుర్తి, చిన ముషిడివాడ, సుజాతనగర్ ప్రాంత వాసులు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు. ఇదే సమయంలో విజృంభించిన కోవిడ్ మొదటి దశ మరింత భయభ్రాంతులకు గురి చేసింది. అయితే మృతి చెందిన వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కానీ తమకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరికి అందినా.. మరి కొందరికి పరిహరం అందలేదని అంటున్నారు. ఈ ప్రమాదానికి గురై ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలతో ఇంకా బాధపడుతున్నామని బాధితులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే వివిధ గ్రామాలలో పర్యటించిన మంత్రులు, అధికారులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఆస్పత్రి మాటే లేదని ఆరోపిస్తున్నారు. అయితే గతంలో పాలిమర్స్ ఫ్యాక్టరీ పరిసరాల్లో రెండు వేల ఎకరాల వరకు సాగు అయ్యేది. అయితే ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీ రంగు మారిన నీళ్ళు పంట భూముల్లోకి పారడంతో పంటలు సరిగ్గా పండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ పండినా పంటలో నాణ్యత ఉండటం లేదంటున్నారు. ఈ రంగు మారిన నీళ్లు పశువులు సైతం తాగి మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఇక 319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించిన నీరబ్ కుమార్ కమిటీ నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి.. లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి అంటూ నివేదిక సమర్పించింది. ఏది ఏమైనా కంపెనీని అక్కడ నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎల్జీ పాలీమర్స్ సంస్థలో ఉత్పత్తులు, యంత్రాలను విక్రయించాలని, ఆ ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్ .. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మృతులు, బాధితుల కుటుంబాలకు రూ. 37.10 కోట్ల పరిహారం చెల్లించామని, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం రూ.50 కోట్లు డిపాజిట్ చేశామని ఎల్జీ పాలిమర్స్ తెలిపింది. ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులు, ముడి సరకు అమ్మగా వచ్చిన సొమ్మును కలెక్టర్ వద్ద జమ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు పాలిమర్స్ తరపు న్యాయవాదులు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థలకు తమ వాదనలు తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.
అయితే ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్నా.. విషాద ఘటన తమ కళ్ల ముందే ఇంకా కదలాడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన ఏడాదైనా వెంటాపురం గ్రామస్థులను ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. వెంకటాపురంతో పాటు నందమూరి నగర్, వెంకటాద్రి గార్డెన్స్, జనతా కాలనీ, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం కాలనీ ప్రజలు ఏడాది కిందటి ప్రమాదాన్ని గుర్తు చేసుకుని భయాందోళనకు గురవుతున్నారు. విషవాయువు లీకై గ్రామానికి చెందిన 12 మంది ప్రమాదం జరిగిన రోజున మృతిచెందగా, మరో ముగ్గురు మరికొన్ని రోజుల తర్వాత మృతి చెందారు. స్టైరిన్ పీల్చిన కారణంగా గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇంకా కంపెనీ మూతపడడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో పలువురు రోడ్డునపడ్డారు. ఒకప్పుడు గ్రామంలో స్థలాలు, పొలాలు, ఇళ్ల్లు కొనుగోలు కోసం తిరిగినవారు నేడు ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. అప్పటి నుంచి తమ బతుకుల రోడ్డున పడినట్లు అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దీంతో పాటు ప్రమాదం కారణంగా ఇబ్బందులు పడిన చాలా మంది వరకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే ప్రమాదం జరిగిన రోజు మృతిచెందిన 12 మందికి రూ.కోటి చొప్పున పరిహారం అందినా, ఆ తరువాత కొద్దిరోజులకు చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు మాత్రం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 150 మందికి నేటికీ ప్రభుత్వం అందజేస్తామన్న రూ.10 వేల పరిహారం అందలేదని, ఇప్పటి నుంచి తమ ఆరోగ్యం బాగా ఉండటం లేదని, ఆనారోగ్యాలు వెంటాడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఆస్పత్రుల్లో వేలు ఖర్చు చేశామని, అయినా ఆనారోగ్య సమస్య ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.