MLA vs Public: నచ్చిన నేతకు నీరాజనం పలుకడమే కాదు.. తేడా వస్తే ఆ నేతను నిలదీయడం కూడా తెలుసునని నిరూపించారు ప్రజలు. తాజాగా ఓ ఎమ్మెల్యేను అడ్డగించిన ప్రజలు.. తమ ఊర్లోకి రావొద్దంటే రావొద్దంటూ అడ్డగించారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. సొంత మండలానికి చెందిన ప్రజలే ఇలా అడ్డుకోవడంతో సదరు ఎమ్మెల్యే షాక్ అయ్యారు. చివరకు చేసేది లేక.. ఆ ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడకు చేదు అనుభవం ఎదురైంది. ‘‘రావద్దు.. రావద్దు మా గడపకు రావద్దు.. సమస్యలు పట్టని ఎమ్మెల్యే మాకొద్దు.’’ అంటూ కొంగాటం గ్రామ ప్రజలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ‘‘ఎమ్మెల్యే, సర్పంచ్ మా గడపకు రావొద్దు. మీకో దండం.’’ అంటూ బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు కొంగాటం గ్రామస్తులు. అయితే, సొంత మండలంలోనే గడ్డు పరిస్థితి ఎదురవ్వడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఈ ఊహించని తిరుగుబాటుతో ఆయన కంగుతిన్నారు. ఇదిలాఉంటే.. పట్టం కట్టామని పట్టించుకోకుండా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని పౌరులు వార్నింగ్ ఇస్తున్నారు.
Also read: