ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో యువతీ , యువతులు ఫోటోలు దిగి అప్‌లోడ్ చేస్తుంటారు. కొద్ది మంది ఆకతాయిలు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి వేధింపులకు పాల్పడతారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోటోలను వారి కుటుంబ సభ్యులకు పంపి మరీ డబ్బులు పంపాలని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటనలు కూడా అనేకం చూశాం. ఒక్కోసారి సోషల్ మీడియాలో సైతం పెట్టి వేధిస్తారు.
సున్నితమైన మనస్తత్వం ఉన్న వారు ఇలాంటి చర్మలకు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగితే ఆందోళన చెందవద్దని తాము అండగా ఉంటామని విజయవాడ పోలీసులు భరోసా ఇస్తున్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్, సైబర్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే మీ సమస్యకు పరిష్కారం చూపే ఓ మార్గాన్ని తెలియజేశారు.
మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా మీరే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫోన్ కి వచ్చిన ఫొటోలను www.stopncii.org వెబ్‌సైట్‌కు పంపించాలి. ఇందులోని 9 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఫింగర్ ప్రింట్ తరహాలో ఒక కేసు నమోదు అవుతుంది. తర్వాత మీకు వచ్చిన ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలి. ఎవరైనా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆ వివరాలను కూడా మీకు వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తుంది.
ఈ వెబ్‌సైట్ పూర్తిగా భద్రమైందని పోలీసులు హామీ ఇస్తున్నారు. మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్ చేయదు. డిజిటల్ ఫింగర్ ఫ్రింట్ ద్వారా ఒక ప్రత్యేకమైన యాష్‌ను రూపొందిస్తుంది. వేలిముద్రను మనం ఎలాగైతే గుర్తిస్తామో డిజిటల్ ఫింగర్ ఫ్రింట్ తరహాలో మీ ఫొటోతో రూపొందిన ఈ ప్రత్యేకమైన యాష్. సోషల్ మీడియాల్లో అప్‌లోడ్ అయినా వెంటనే ఫొటోలను గుర్తించి తొలగిస్తుంది. 2015లో రూపొందించిన ఈ వెబ్‌సైట్.. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 2 లక్షల మంది అశ్లీల చిత్రాలను తొలగించి, వారికి వ్యక్తిగత రక్షణ కల్పించిందని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..