PV Chalapathi Rao passes away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న చలపతిరావు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ నేత పీవీఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు. ఆసుపత్రి నుంచి పీవీ చలపతిరావు పార్థివదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
కాగా, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, పీవీ చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి చలపతిరావు తనకు మార్గదర్శకులుగా నిలిచారని.. ఆయన మరణం తీరని లోటని సోము ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం అని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల్లో ఆయన ఒకరని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సోము వీర్రాజు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..