అదిగో వయ్యారిభామ అనగానే ఆ అమ్మాయి ఎక్కడ ఎక్కడ అని తిరిగి చూస్తారు. అలాగే “వయ్యారి భామ నీ హంస నడక” అంటూ భావకవిత్వం సైతం సినిమాలో పాట రూపంలో వయ్యారిభామ పై వచ్చింది. అయితే ఓ వయ్యారి భామను చూస్తే మాత్రం అయ్యబాబోయ్ అని దూరంగా జరుగుతారు. మరి ఎవరా వయ్యారిభామ ఎవరా అనుకుంటున్నారా.. ఇప్పుడు చెప్పుకుంటుంది అమ్మాయి గురించి కాదు. అది ఒక మొక్క. మొక్క అంటే ఆషా మాషి మొక్క కాదు. దాని పేరు వింటేనే రైతుల గుండెల్లో హడల్.. అసలు ఈ వయ్యారి భామ మొక్క ఏంటి, దానివల్ల రైతులు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లల ముక్కుపుడక
వయ్యారిభామ అనేది ఓ కలుపు మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. వజ్రంలా తెల్లవిగా పూస్తాయి. పిల్లలు ఆడుకునే సమయంలో వీటిని కోసి ముక్కును తుడి చేసి ముక్కుపుడుకలా పెట్టుకునేవారు. తడి ఆరే వరకు వరకు ముక్కుపుడుక అందంగా కనిపిస్తుంది. మొదలు , కొమ్మలు అన్నీ సన్నగా , ఆకులు చామంతి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. గాలి కి ఈ మొక్క అటు ఇటూ ఊగుతుంటే దాని వయ్యారం గట్టుపై గడ్డి మోపుతో వెళ్లే మగువ నడకలా ఉంటుంది.. అందుకే మన తెలుగు వారు దీనికి వయ్యారి భామ అని పేరు పెట్టారు. వాస్తవానికి ఇది ఒక కలుపు మొక్క. దీని వల్ల ప్రతియేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కలుపు మొక్కను ఎన్ని రకాలుగా అంతమొందించాలని చూసినా మళ్లీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూలన పుట్టుకు వస్తూనే ఉంది. దీన్ని పార్దీనియం మొక్క అంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రైతులు దీనిని వయ్యారి భామ అని అంటారు. ఈ మొక్క అన్ని భాగాల్లో పార్థినిస్ అనే విష పదార్థం ఉండుట వలన మనుషులకే గాక పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ మొక్క వ్యవసాయంలో సుమారు 40 శాతం వరకు పంటని నష్టపరుస్తుంది. ఈ కలుపు మొక్క ఎక్కువగా పంట పొలాలు, బంజరు భూముల్లో, ఖాళీ ప్రాంతాలలో, రోడ్లకు ఇరువైపులా, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఈ మొక్క అమెరికాకు చెందిన మొక్క అని చెబుతారు. విదేశీయులు క్రోటన్ మొక్క కుండీలో ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. మరికొందరు సుమారు 70 సంవత్సరాల క్రితం గోధుమ విత్తనాల దిగుమతి ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిందంటారు.. ఇది సుమారు రెండు మీటర్ల ఎత్తు పెరిగి, ఆకులు చీలికలతో కూడి వాటిపై రోమాల వంటి సన్నని నూగుతో శాకోప శాఖలుగా విస్తరించి ఉంటుంది. మొలకెత్తిన నాటి నుంచి నాలుగు నుంచి ఆరు వారాల్లోనే పూత దశకు చేరుకుని 10 వేల నుంచి 25 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని విత్తనాలు గాలిలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తాయి.
ఈ మొక్కల పుప్పడి వలన మనుషులు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, తామర లాంటి చర్మవ్యాధులు, విష జ్వరాలు, ఉబ్బసం పుప్పుడిని పేల్చడం ద్వారా జలుబు కళ్ళు ఎర్రబడటం, కళ్ళ వాపులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే పశువుల్లో సైతం ఈ వయ్యారిభామ కలుపు మొక్క తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పశువులకు ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్ర జ్వరం, అలాగే వెంట్రుకలు రాలిపోవడం, పాల ఉత్పత్తి తగ్గి బరువు కూడా తగ్గిపోతాయి. సాధారణంగా వీటిని పశువులు తినవు కొన్ని సందర్భాల్లో గడ్డితో పాటు వాటి శరీరాల్లోకి ప్రవేశించటం వల్ల అవి అనారోగ్య బారిన పడతాయి.
రైతులు ఈ మొక్కలు నిర్మూలించటానికి ప్రతి యేటా చాలా శ్రమిస్తారు. వీటిని పీకి పడేస్తే అవి చనిపోవు. విత్తనాలు రాలి మళ్లీ మొలకెత్తుతాయి. అందుకే ఎటువంటి రసాయనాలు వాడిన వాటి నిర్మూలన అంతంత మాత్రమే. ఈ మొక్కను పీకిన తరువాత ఎండబెట్టి తగలబెడితేనే తప్ప వీటికి మరణం లేదు. క్రమం తప్పకుండా రైతులు ఎక్కడ కనిపించినా వేర్లతో సహా పీకి తగలబెట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు.
ఎంత అందమైన మొక్క అయినా ఇది విషతుల్యమైనది కావటం, దీని భాగాలు మనుషులకు, పశువులకు హానికలిగించేవి కావటంతో దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. కంటికి ఇది కనిపిస్తే పూత రాకముందే పీకి కాల్చేయాల్సిన అవసరం ఉంది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..