అనంతపురం, ఆగస్టు 16: చిన్న పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా గమనించుకోవాలి….లేదంటే క్షణాల్లో ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. మీ నిర్లక్ష్యం మీ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే చిన్నారుల ప్రాణాల మీదకు వస్తుంది…. కొన్ని సమయాల్లో వారిని పట్టించుకోకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. వేరుశెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.. ప్రస్తుత శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా వసంతపూర్ కు చెందిన హనుమంతు కుటుంబం నల్లచెరువులోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులంతా మాటల్లో మునిగిపోయిన సమయంలో హనుమంతు రెండేళ్ల కుమార్తె నయనశ్రీ ఆడుకుంటూ వేరుశేనగ విత్తనాన్ని తినేందుకు నోట్లో పెట్టుకుంది.
పల్లీ విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది చిన్నారి. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిన చిన్నారి పరిస్థితి అర్థం కాక కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు. పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
చిన్న పొరపాటుతో అల్లారు ముద్దుగా పెంచుకున్న రెండేళ్ల చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులను నిరంతరం పర్యవేక్షించకుండా పోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయనడానికి రెండేళ్ళ చిన్నారి నయనశ్రీ ఉదంతమే ఉదాహరణ..
ఇదిలా ఉంటే, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెద్ద మల్లేపల్లి గ్రామంలో మరో విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ యువతి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల యువతికి తమ బంధువుల అబ్బాయితో వివాహం ఖాయమైంది. దాంతో ఇద్దరూ తరచూ ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవారు.. ఈ క్రమంలోనే యువతి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావంటూ, వివాహం నిశ్చయం కాకముందే, ఇలా ఫోన్ లు చేసుకోవటం సరికాదని తల్లిదండ్రులు మందలించినట్టుగా తెలిసింది. ఈ చిన్న కారణానికే మనస్తాపానికి గురైన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. ఇంటికి చేరకున్న తల్లిదండ్రులు విగత జీవిగా పడివున్న తమ కూతురిని చూసి బోరున విలపించారు. హుటాహుటినా ఆమెను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..